Tirumala Pandava Theertham :పరమ పవిత్రమైన తిరుమల గిరులలో ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్ధాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల తిరుమల యాత్రలో భాగంగా ఈ తీర్థాలను కూడా దర్శించుకోవచ్చు. తిరుమల పరిసర ప్రాంతాలలో ఉన్న ఓ పుణ్య తీర్థంలో స్నానం చేస్తే విజయాలు ప్రాప్తిస్తాయని అంటారు. ఈ కథనంలో ఆ తీర్థ విశేషాలను తెలుసుకుందాం.
పుణ్యతీర్ధాల సమాహారం
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల ఎన్నో తీర్థాల సమాహారంగా కనిపిస్తుంది. తిరుమల పరిసర ప్రాంతాలలో 'కుమారధార తీర్థం' 'సనక సనందన తీర్థం', 'తుంబుర తీర్థం'. 'జాబాలీ తీర్థం', 'పాపనాశన తీర్థం', 'పాండవ తీర్థం' ఇలా ఎన్నో పవిత్ర తీర్ధాలతో తిరుమల విరాజిల్లుతోంది. ఒక్కో తీర్థంకు ఒక్కో ప్రత్యేకత ఉంది.
పాండవ తీర్థం
తిరుమల గిరులలో వెలసిన పాండవ తీర్థంలో స్నానమాచరించడం వల్ల, సమస్త పాపాలు నశించి, సకల విజయాలు చేకూరతాయని వేంకటాచల మహాత్యం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
పాండవ తీర్థం విశిష్టత
తిరుమల శ్రీనివాసుని ఆలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవ తీర్థం ఉంది. ఈ తీర్థానికి గోగర్భ తీర్థమని పేరుంది.
స్థల పురాణం
పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు, ఈ తీర్థంలో కొంతకాలం పాటు స్నానమాచరించమని శ్రీకృష్ణుడు చెప్పాడట. ఆ విధంగా చేయడం వల్ల విజయం చేకూరుతుందని సెలవిచ్చాడు. దాంతో పాండవులు ఏడాది పాటు ఈ తీర్థం సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని, అందులో స్నానం చేస్తూ వచ్చారట. ఈ కారణంగానే ఆ తరువాత పాండవులు యుద్ధంలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని పొందారు. పాండవుల ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చిన తీర్థం కావడం వల్ల, ఈ తీర్థానికి 'పాండవ తీర్థం' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.