Kashi Uttarark Aditya Temple : శ్రీనాధ మహాకవి రచించిన కాశీ ఖండం ప్రకారం అతి ప్రాచీనమైన కాశీ పట్టణంలో అడుగడుగునా ఆలయాలు కనిపిస్తాయి. అడుగు పెట్టినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే కాశీలో విశ్వనాధుని ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయంతో పాటు ద్వాదశ ఆదిత్యుల ఆలయాల పేరుతో 12 సూర్యుని ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం ఉంది.
ఉత్తరార్క సూర్యదర్శనంతో అఖండ విజయం
కాశీలోని ద్వాదశాదిత్యుల ఆలయాలలో విజయాలను ప్రసాదించే ఆలయంగా ఉత్తరార్క సూర్య దేవాలయం భాసిల్లుతోంది. ఈ ఆలయంలో సూర్యుని దర్శిస్తే విజయాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అందుకు ఆధారమైన పౌరాణిక గాధను గురించి తెలుసుకుందాం.
రాక్షసుల ధాటికి సూర్యుని ఆశ్రయించిన దేవతలు
పూర్వం రాక్షసులు స్వర్గంపై దాడి చేసి వశం చేసుకున్నప్పుడు దేవతలంతా చెల్లాచెదురైపోయారు. రాక్షసుల ధాటిని తట్టుకోలేకపోయిన దేవతలు, వారిని జయించే మార్గం చెప్పమని సూర్యభగవానుడిని ఆశ్రయిస్తారు.
దేవతలకు ఉపాయం చెప్పిన సూర్యుడు
దేవతల ప్రార్థన మన్నించిన సూర్యుడు వారికి ఒక పర్వత శిలను ఇచ్చి ఆ శిలను కాశీ క్షేత్రానికి వెళ్లి తన రూపాన్ని చెక్కమని చెబుతాడు. దేవతలు సూర్యుని రూపాన్ని చెక్కే సమయంలో శిల నుంచి రాలిపడే రాతి ముక్కలను ఆయుధాలుగా రాక్షసులపై ప్రయోగించమని సూర్యుడు చెబుతాడు.