Karthika Puranam Chapter 7 :వశిష్ఠులవారు జనకునితో కార్తిక మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలను గురించి వివరిస్తూ ఇంకను ఇట్లు చెప్పసాగెను. "ఓ జనక మహారాజా! కార్తిక మాసము గురించి దాని మహాత్యమును గురించి ఎంత చెప్పినను, ఎంత విన్ననూ తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్రకమలములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది. తులసీదళాలతో గాని, బిల్వపత్రములతోగాని శివకేశవులకు సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కల్గును.
సాలగ్రామ పూజ - వనభోజనం
కార్తిక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి భక్తితో పూజించి, అక్కడే బ్రాహ్మణులకు భోజనము పెట్టి, తాను కూడా భుజించిన యెడల సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తిక స్నానములు, దీపారాధన చేయలేనివారు ఉదయం, సాయంకాలం ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినచో వారికి పుణ్యప్రాప్తి కలుగును. శక్తికలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేధయాగము చేసినంత ఫలము కల్గును. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కల్గును.
నంద దీపం ఎలా వెలిగించాలి?
కార్తిక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గును పెట్టి, నువ్వులు, ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులనూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరిపోకుండా వెలుగవలెను. దీనినే నంద దీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి, కార్తిక పురాణము చదువుచుండిన యెడల హరిహరాదులు సంతృప్తి చెంది కైవల్యం మొసంగెదరు. అలాగే కార్తిక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ధి కలుగును.