Karthika Puranam Chapter 18 : కార్తిక మాసం సందర్భంగా -ధనలోభుడు, అంగీరస మహామునుల సంవాదమును గురించి ఇంకను వివరిస్తూ వశిష్ఠుడు జనకునితో పద్దెనిమిదో రోజు కథలో వివరించిన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అంగీరస ధనలోభుల సంవాదం
అంగీరస మహాముని ఆత్మ, శరీరం గురించి చేసిన తత్వోపదేశం విన్న తరువాత ధనలోభుడు "ఓ మునివర్యా! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా సందేహములను తీరునట్లు మీరు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుంచి నేను మీకు శిష్యుడను అయ్యాను. నా పూర్వ పుణ్యఫలము చేత నాకు మీ సాంగత్యము కలిగింది. అందుకే ఎక్కడో అరణ్యాలలో చెట్టునై పడి ఉన్న నేను ఈ రోజు మీ కృపతో ముక్తిని పొందాను. లేకుంటే పాపాత్ముడైన నేను కార్తిక మాసంలో ఈ పరమ పవిత్రమైన దేవాలయములోనికి ప్రవేశించగలిగే వాడిని కాదు. నన్ను తమరు తప్పక శిష్యునిగా స్వీకరించవలెను. అంతేకాక మానవుడు ఎటువంటి మంచి పనులు చేయవలెనో, దాని ఫలం ఎట్టిదో వివరించవలెను" అని ప్రార్థించెను.
అంగీరసుడు వివరించిన సత్కర్మలు
అంతట అంగీరసుడు "ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగమైనవి కాబట్టి వాటికి సమాధానాలు చెబుతాను వినుము" అని చెప్పసాగెను. మానవుడు ఈ శరీరమే సత్యమని నమ్మి అశాంతికి లోనగుచున్నాడు. సుఖదుఃఖాలు శరీరానికే గాని ఆత్మకు ఉండవు. కనుక అసలు మానవుడు తాను ఏ జాతికి చెందినవాడో, ఎటువంటి కర్మలు చేయవలెనో తెలుసుకుని వాటిని ఆచరించవలసి ఉంటుంది.
బ్రాహ్మణులు ఆచరించాల్సిన సత్కర్మలు
బ్రాహ్మణుడు అరుణోదయమున స్నానము చేయక ఎటువంటి సత్కర్మలు ఆచరించినను అవి వ్యర్థం. కార్తిక మాసంలో సూర్యుడు తులా రాశిలో, వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలో, మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు - ప్రాతః కాలమునందు నదీ స్నానం చేసి, దేవతార్చన చేసినచో తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును" అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోభుడు "ఓ మహానుభావా! చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? ఆ వ్రత విధానమెట్టిది? దాని ఫలితమేమి? నాకు వివరంగా చెప్పమని కోరుతున్నాను" అని అడుగగా, అందుకు అంగీకరించిన అంగీరసుడు ఇట్లు చెప్పసాగెను.
చాతుర్మాస వ్రతం మహత్యం
"ఓ ధనలోభా! వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేష పాన్పుపై శయనిస్తాడు. దీనినే 'తొలి ఏకాదశి' అని 'శయన ఏకాదశి' అని అంటారు. అక్కడ నుంచి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉన్న విష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేలుకుంటాడు. ఈ నాలుగు నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నాన, దాన, జపతపాలు ఏవి చేసినను పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ విషయములు ఆ శ్రీహరి నాకు స్వయముగా చెప్పాడు కావున నేను నీకు చెబుతున్నాను. నీకు ఇది అర్థం కావడానికి ఒక కథ చెబుతాను వినుము" అంటూ చెప్పసాగెను.