Karthika Masam Navagraha Puja 2024 :కార్తిక మాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అయితే, నవగ్రహ దోషాలు పోవడానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి.. ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకమైన సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
సూర్యుడి బలం లేనివారు :జాతకంలో సూర్యుడి బలం లేకపోతే.. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆలస్యమవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు ఆలస్యమవుతాయి. కాబట్టి, జాతకంలో సూర్యుడి బలం లేనివారు ఈ కార్తికంలోనవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. 'ఓం ఆదిత్యాయ నమః'అని చదువుకుంటూ 6 ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలుంటుంది.
జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే :జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉన్నట్లయితే.. ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే తల్లివైపు నుంచి ఆస్తులు రావడం ఆలస్యమవుతుంది. ఇలాంటి వారు చంద్రుడికి సంబంధించిన 'సోం సోమాయ నమః' అనే మంత్రం చదువుకుంటూ 16 ప్రదక్షిణలు చేయాలి. 16 ప్రదక్షిణలే ఎందుకంటే.. జాతకంలోచంద్ర మహాదశ 10 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలుంటుంది. అయితే, ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సరే.. సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కూడా కలుపుకుని చేయాలి. ఇలా చేస్తేనే ఆ గ్రహం సంపూర్ణమైన శక్తి లభిస్తుంది.
జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉంటే :జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉన్నవారికి అప్పులు ఎక్కువవుతాయి. గృహయోగం ఆలస్యమవుతుంది. రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి. రుణాలు త్వరగా లభించవు. అలాంటప్పుడు కార్తికంలో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది. కుజ దశ జాతకంలో 7 సంవత్సరాలుంటుంది. రవి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 13 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం అం అంగారకాయ నమః'అనే మంత్రం జపించాలి.
జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉంటే :జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉన్నట్లయితే.. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సమస్యలు వస్తుంటాయి. ఈ మూడు రంగాల్లో అనుకూలత రావాలంటే.. బుధ గ్రహం అనుగ్రహం కోసం కార్తికంలో ప్రదక్షిణలు చేయాలి. బుధుడి దశ జాతకంలో 17 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 23 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో 'బుం బుధాయ నమః' అనే మంత్రం జపించాలి.
జాతకంలో గురువు బలం లేకపోతే :జాతకంలో గురువు బలం తక్కువగా ఉంటే.. బంగారాన్ని కొనుక్కునే యోగం ఉండదు. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. వివాహ సమస్యలుంటాయి. సమాజంలో విలువ ఉండదు. ఇలాంటి వారుఇబ్బందుల నుంచి బయట పడడానికి గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. జాతకంలో గురు దశ 16 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 కలుపుకుని.. 22 ప్రదక్షిణలు చేయాలి. ఈ సమయంలో గురువుకు సంబంధించిన 'బృం బృహస్పతయే నమః' అనే మంత్రం చదువుకోవాలి.