Kamika Ekadashi 2024 :ఆషాఢ మాసం కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకొంటారు. మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఈ ఏకాదశికి ఉందని భక్తుల విశ్వాసం. ఆషాడం శుక్ల పక్షంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడం వల్ల దీనిని విశేషంగా భావిస్తారు. ఈ కామిక ఏకాదశి గురించి ప్రస్తావన నారద పురాణం, బ్రహ్మ పురాణంలో ఉంది.
కామిక ఏకాదశి రోజున ఎవరిని పూజించాలి?
శంఖ, చక్ర గదాధరుడు అయిన శ్రీ మహా విష్ణువును ఈ రోజు లక్ష్మీదేవి సమేతంగా పూజించాలి. 'కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్నీ దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం ఎన్నో రెట్లు ఎక్కువ' అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
కామిక ఏకాదశి పూజ సమయం
తెలుగు పంచాంగం ప్రకారం కామిక ఏకాదశి జులై 30వ తేదీ సాయంత్రం 4:45 నిమిషాలకు ప్రారంభమై 31వ తేదీ మధ్యాహ్నం 3:56 నిమిషాల వరకు ఉంది. మన సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజు ఏకాదశి వ్రతం చేసుకోవాలి కాబట్టి జులై 31వ తేదీనే కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
పూజా విధానం
కామిక ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొవాలి. లక్ష్మీనారాయణుల మూర్తులను ప్రతిష్టించుకొని ఆవు నేతితో దీపారాధన చేసి తులసి దళాలు సమర్పించాలి. శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తికి ఈ రోజు వెన్న నైవేద్యంగా సమర్పించి అనంతరం దానిని ప్రసాదంగా అందరికీ పంచి పెట్టాలి. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ, గ్రాసముతో కలిపి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు.
సాయం సంధ్యా పూజ
సాయంత్రం తిరిగి స్నానం చేసి తులసి కోట వద్ద దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. వీలైతే సమీపంలోని వైష్ణవ ఆలయాన్ని సందర్శించి శ్రీమన్నారాయణుని దర్శించాలి. రాత్రంతా భాగవత కథలతో, భగవన్నామ సంకీర్తనలతో కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. కామిక ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలిపే కథను చదువుకోవాలి.