తెలంగాణ

telangana

శ్రావణం స్పెషల్​: గోపూజ ఇలా చేయండి - లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి! - Gopuja in Sravana Masam

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 5:34 PM IST

Gopuja Importance: గోమాతను పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అయితే.. పరమ పవిత్రమైన శ్రావణమాసంలో గోమాతను పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటి? గోపూజ ఎలా చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gopuja Importance
How to Do Perform Gopuja in Sravana Masam (ETV Bharat)

How to Do Perform Gopuja in Sravana Masam:శ్రావణ మాసం వచ్చిదంటే ప్రతి ఇంట్లో సందడే సందడి. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో ఈ నెల మొత్తం కోలాహలంగా మారుతుంది. ఇక ముత్తైదువులు మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తూ ఇంటికి కొత్త శోభను తెస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ పూజలు నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనాలు చెల్లిస్తారు. ఇలా ఒక్కటేమిటి శ్రావణం మొదలు నెలంతా ఏదో ఒక పండగలు ఉంటూనే ఉంటాయి. అయితే.. శ్రావణ మాసంలో కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ కూడా చేయాలని.. గోమాతలను పూజించడం వల్ల కోరిన కోర్కెలు తొందరలోనే నెరవేరతాయని ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. అలానే గోపూజ ఎలా చేసుకోవాలో కూడా ఆయన వివరిస్తున్నారు. ఆ విధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

గోపూజ వెనక కారణాలు: శ్రావణమాసంలో లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ చేయడమనేది విశేషమైన ఫలితాలను అందిస్తుందని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఎందుకంటే దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని తెలిసిందే. అయితే ఆ సమయంలో లక్ష్మీదేవితోపాటుగా నంద, సుభద్ర, సుశీల, సురభి, బహుళ అనే 5 గోవులు కూడా వచ్చినట్లు భవిష్య పురాణం చెబుతోందని ఆయన చెబుతున్నారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే అమ్మవారితో పాటు గోవులను కూడా పూజించాలని వివరిస్తున్నారు. శ్రావణ మాసంలో ముహూర్తంతో సంబంధం లేకుండా ఏరోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.

శ్రావణమాసంలో గోపూజ ఎలా చేయాలంటే:ఇంటి ముందు గోవు వచ్చినా లేదంటే దగ్గరలోని గోశాలకు వెళ్లైనా గోమాతకు పూజ చేయవచ్చు.

  • ముందుగా గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆ తర్వాత గోవు పాదాలకు తెల్ల పూలు, జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ "ఓం సురభ్యే నమః" అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి.
  • అనంతరం గోమాతకు అర్ఘ్యం సమర్పించాలి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో అక్షింతలు, పూలు వేసి ఆ నీటిని గోవు పాదాల మీద పడే విధంగా అర్ఘ్యం సమర్పించాలి.
  • ఆ తర్వాత గోవుకు ఆహారాన్ని తినిపించాలి. అంటే గడ్డి లేదా పచ్చి ఆకుకూరలు లేదా అరటి పండ్లు వంటి వాటిని తినిపించి.. గోమాత చుట్టూ 3 లేదా 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. దీంతో గోపూజ పూర్తయినట్లే.

ప్రత్యక్షంగా చేయలేకపోతే:ఒకవేళ గోమాతకు ప్రత్యక్షంగా పూజ చేయలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా కూడా పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు మాచిరాజు.

  • అందుకు ఆవు, దూడ ఉన్నటువంటి బొమ్మ లేదా గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి.
  • శ్రావణమాసంలో ప్రతిరోజూ ఆ బొమ్మకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి తెల్లపూలు, జిల్లేడు పూలతో పూజించాలి.
  • ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు.
  • పూజ చేసేటప్పుడు ఓం సురభ్యే నమః మంత్రం చదువుకోవాలి.

గోపూజ చేస్తే ఏం జరుగుతుంది:శ్రావణ మాసంలో ఇలా గోపూజ చేస్తే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని అంటున్నారు.

  • గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేయడానికి కొంత ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లైతే పితృదోషాలు తొలిగి.. వారి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.
  • ఒకవేళ మీరు మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే అది నెరవేరాలని ఓ పేపర్​ మీద రాసి దానిని ఇంటికి తెచ్చుకున్న గోమాత బొమ్మ పాదాల వద్ద ఉంచి శ్రావణ మాసం మొత్తం పూజ చేసిన తర్వాత ఆ కాగితాన్ని ఏదైనా దేవతావృక్షం మొదట్లో పెట్టి నమస్కారం చేసుకోవాలి.
  • ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేసినట్లైతే సమస్త శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details