Lakshmi Pooja Vidhanam Telugu :'కలౌ వేంకట నాధాయ' అంటారు. అంటే కలియుగంలో శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అని అర్థం. శ్రీ మహాలక్ష్మిని శాశ్వతంగా తన వక్షస్థలంలో నిలుపుకున్న శ్రీనివాసుని పూజిస్తే సకల సంపదలు సొంతమవుతాయని అంటారు. శ్రీ వేంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం అమ్మవారి అనుగ్రహం సులభంగా పొందాలంటే అయ్యవారిని ఆశ్రయించాల్సిందే!
లక్ష్మీదేవి ప్రీతి కోసం ఇలా చేయాల్సిందే!
కలియుగ దైవంగా భక్తుల పూజలు అందుకునే వేంకటేశ్వరుని పూజించడం వలన కర్మ ఫలితంగా అనుభవించే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారు. కలియుగంలో కష్టాలను తీర్చువాడు వేంకటేశ్వరుడు అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దర్శనం పరమ పవిత్రం
శ్రీనివాసుని దర్శనం పరమ పవిత్రం. 'శ్రీ' అంటే లక్ష్మీ. 'నివాసుడు' అంటే కలిగి ఉన్నవాడు అని అర్ధం. అంటే లక్ష్మీదేవిని నిరంతరం తన వక్షస్థలంపై నిలుపుకున్న శ్రీనివాసుని దర్శిస్తే చాలు పాపాలన్నీ పటాపంచలై పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది కేవలం వెంకన్న గొప్ప మాత్రమే కాదు వెంకన్న హృదయంలో ఉన్న సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా!
శుక్రవారం ఇలా పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి
శుక్రవారం ఐశ్వర్యానికి స్వాగతం చెప్పాలనుకునేవారు ఉదయాన్నే తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, సాంబ్రాణి ధూపం వేయాలి. వెంకటేశ్వర స్వామి చిత్ర పటం కానీ విగ్రహాన్ని కానీ పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై ఉంచుకోవాలి.
సిరికి హరికి పూజ
శ్రీ మహాలక్ష్మీ స్థిర నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి. 108 తులసి దళాలను సేకరించాలి. శుక్రవారం తులసి దళాలు తెంపకూడదు కాబట్టి ముందు రోజే సేకరించుకోవాలి. ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క తులసి దళం స్వామి పాదాల వద్ద ఉంచాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. శ్రీనివాసుని, శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన పొంగలి ప్రసాదాన్ని నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి. పూజ పూర్తయ్యాక భక్తి శ్రద్దలతో గోవింద నామాలు చదువుకోవాలి. అనంతరం సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ పూజకు కఠిన నియమాలు లేవు. పూజ పూర్తయ్యేవరకు ఉపవాసం ఉంటే చాలు. పూజలో భక్తి శ్రద్ధలు ముఖ్యం.