How to celebrate Bhogi Festival :సరదాల సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ రోజును భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినంగా భావిస్తారు. పండగ రోజున అందరూ తెల్లవారు జామునే లేచి భోగి మంటలు వెలిగిస్తుంటారు. అయితే, భోగి మంటల్లో ఒక మూట వేయడం వల్ల ఏడాదంతా శుభ ఫలితాలుకలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
భోగి మంటల వెనుక కథ :
చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. అందరూ పాత వస్తువులు కాల్చుతున్నారని వీధుల్లో మంటలు పెడతారు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఎన్నో రోజుల నుంచి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడి కరుణించి ప్రత్యక్షమయ్యాడు. నీ కోరిక ఏంటో చెప్పమని రాక్షసుడిని అడిగాడు. ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు.
ఇలా రాక్షసుడు మిగతా సమయాల్లో మరణించకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. అనంతరం రురువు దేవతలందరినీ ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు దేవతలందరూ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెడతారు. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. రాక్షసుడి చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.
సందేశం :
భోగి మంటలు వేయడం వెనుక ఒక వైజ్ఞానిక రహస్యం కూడా దాగి ఉంది. 'రురువు' అంటే సూక్ష్మక్రిమి అని అర్థం. ఈ చలికాలంలో వాతావరణంలో సూక్ష్మక్రిములన్నీ తొలగిపోవడానికి భోగి మంటలు తోడ్పడతాయి. అలాగే భోగి పండగ ఒక సందేశం కూడా అందిస్తుంది. అదేంటంటే మనలోని చెడు గుణాలన్నీ ఆ భోగి మంటల్లో కాల్చేయాలి.
గ్రహ దోషాలు తొలగిపోతాయి :
భోగి నాడు పిల్లలు, పెద్దలందరూ వేకువజామునే లేచి ఎంతో ఉత్సాహంగా భోగి మంటలను వేస్తారు. ఆ మంటల్లో ఇంట్లో పాత సామాన్లు, అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను భోగి మంటల్లో వేసేస్తుంటారు. అయితే, గ్రహ దోషాలుతొలగిపోవడానికి ఒక పరిహారం చేయాలని మాచిరాజు చెబుతున్నారు. అదేంటంటే భోగి మంటల పక్కన ఒక బిందెడు నీళ్లను ఉంచండి. నీళ్లు వేడైన తర్వాత ఆ నీటిని స్నానం చేసే బకెట్లో కొన్నింటిని పోసుకోండి. ఇలా భోగి మంటల దగ్గర ఉంచిన వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని మాచిరాజు అంటున్నారు.
మూట మంటలో వేయండి!
ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అందులో కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, రెండు గోమతి చక్రాలు ఉంచండి. ఎర్రటి వస్త్రాన్ని మూటకట్టి, భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి. ఆపై మూటను మంటలో వేయండి. ఇలా చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. త్వరగా అదృష్టం కలిసివస్తుంది. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల సంవత్సరమంతా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉండవని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ఇంద్రుడి అనుగ్రహం కోసం:
భోగి మంటల దగ్గర ఉన్న బూడిదను నుదుటి మీద బొట్టులా, హృదయం, చేతుల దగ్గర రాసుకోవాలి. అగ్ని దేవుడి నుంచి సిరిసంపదలు రావాలని 'శ్రీయమిచ్చేత్ హుతాసనాత్' అనే మంత్రం 11 సార్లు జపించాలి. శ్రీయము అంటే సంపద, హుతాసనాడు అంటే అగ్ని దేవుడు. ఇలా చేయడం వల్ల అగ్ని దేవుడు సిరిసంపదలను అందిస్తాడు. భోగి రోజున డప్పులు వాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. వర్షాలు కురిపించే ఇంద్రుడికి గౌరవంగా డప్పులు వాయిస్తారు. భోగి మంటల దగ్గర డప్పులు వాయించడం వల్ల ఇంద్రుడి అనుగ్రహం పొందవచ్చు అని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శ్రీవారి పుష్కరిణిలో స్నానం - ముక్కోటి దేవతల దర్శన ఫలం- సకల పాపాలు దూరం!
శనికి ప్రీతికరమైన పుష్య మాసం- ఈ పరిహారాలతో దోషాల నుంచి విముక్తి!