Astrological Remedies for Wealth Gain : చాలా మంది నెలఖారు కల్లా ఖర్చులు ఎక్కువైపోయి పైసా కూడా మిగలడం లేదని బాధపడుతున్నారు. అయితే, సంపాదించిన డబ్బులు నిలబడడానికి, అలాగే ఖర్చులు తగ్గడానికి కొన్ని పరిహారాలు చేయాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం
8 ప్రమిదల పరిహారం :
డబ్బు నిలబడడానికి ఇది చాలా శక్తివంతమైన పరిహారమని పరిహార శాస్త్ర గ్రంథాల్లో తెలిపారు. ముందుగా మార్కెట్లో ఎర్రటి కొత్త మట్టి ప్రమిదలను కొనుగోలు చేయండి. ఆపై ఏదైనా శుక్రవారం రోజున తలస్నానం చేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించండి. అనంతరం చిత్రపటం దగ్గర మట్టి దీపాలను ఉంచి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయండి. ఆ ప్రమిదల్లో వత్తులు వేసి దీపాలు వెలిగించండి. అనంతరం ఒక్కోక్క ప్రమిద దగ్గర ఒక్కో తీపి పదార్థం ఉంచండి. ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కరించి హారతి ఇవ్వండి. ఆపై తీపి పదార్థాలను కుటుంబ సభ్యులు స్వీకరించాలి. అలాగే చుట్టు పక్కల ఉన్నవారికి అందించాలి. ఇలా కనీసం ఆరు శుక్రవారాలు చేస్తే సంపాదించిన డబ్బులు నిలబడతాయని, అలాగే ఖర్చులు తగ్గుతాయని మాచిరాజు చెబుతున్నారు.
పిల్లలకు కలాకండ్ ఇవ్వాలి :
శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కలాకండ్ నైవేద్యంగా సమర్పించాలి. ఆపై తొమ్మిదేళ్లలోపు ఉన్న ఐదుగురు ఆడపిల్లలను ఇంటికి పిలిచి వారికి కలాకండ్ ఇవ్వాలి. ఇలా ఆరు శుక్రవారాలు చేయడం వల్ల సంపాదించిన డబ్బు నిలబడుతుందని మాచిరాజు చెప్పారు.
జమ్మిచెట్టు పరిహారం :
పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చైపోతున్నవారు జమ్మిచెట్టు పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శుక్రవారం రోజున ఆలయాల్లో లేదా ఎక్కడైనా జమ్మిచెట్టు ఉండే చోటుకు వెళ్లాలి. అక్కడ బియ్యం పిండితో ముగ్గు వేయాలి. జమ్మిచెట్టు మొదట్లో పసుపు, కుంకుమ, కొన్ని పూలు వేయాలి. ఆపై దీపం పెట్టి జమ్మచెట్టు చుట్టూ 'ఓం శమీ వృక్ష దేవ్యై నమః' అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. మంత్రం జపించలేని వారు చేతులు జోడించి ప్రదక్షిణలు చేయవచ్చు. అనంతరం జమ్మిచెట్టు ఉత్తర దిక్కువైపు ఉన్న ఒక చిన్న కొమ్మను విరిచి ఇంట్లో బీరువాలో దాచుకోవాలి. ఈ శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఇంట్లో వృథా ఖర్చులు తగ్గిపోతాయని మాచిరాజు తెలిపారు.
గోధుమ పిండితో :
శుక్రవారం రోజున కాస్త గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం, నీరు కలిపి 21 చిన్న ఉండలు చేయాలి. వాటిని చెరువు, లేదా వాగుల్లో ఉండే జలచరాలకు ఆహారంగా వేయాలి. ఈ పరిహారం మూడు నెలలకు ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వల్ల సంపాదించిన డబ్బు నిలబడుతుందని మాచిరాజు పేర్కొన్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
కొత్త కుండతో ఇలా చేస్తే - కష్టపడి సంపాదించిన ఆస్తులు కరిగిపోకుండా ఉంటాయట!
'చింతలు తీర్చే 'చింత కొమ్మ తాంత్రిక పరిహారం' - ఇంటి వాస్తు దోషాలకు చెక్'