Green Energy Corridor in AP : రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1200ల సర్క్యూట్ కిలోమీటర్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. సీమ జిల్లాల్లోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే కరెంట్‌ను ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతోంది.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్‌వర్క్ పరిమితి మించడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరి అని సర్కార్ భావిస్తోంది. అందుకే రూ.17,000ల కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్ ఏర్పాటుకయ్యే ఖర్చులో 40 శాతం సమకూర్చాలని కోరింది. కొత్తగా అనుమతించిన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. ప్రస్తుతం సీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానిస్తూ ట్రాన్స్‌కో నెట్‌వర్క్ అందుబాటులో లేదు. ఏపీలోని మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ 10,000ల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు వీలుగా కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ ఆమోదించింది.
Rayalaseema to Uttarandhra : ట్రాన్స్‌కో పరిధిలో ఈ కారిడార్ భారీ ప్రాజెక్టు అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాయలసీమలో సుమారు 5000ల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ విద్యుత్‌ను 17 సబ్‌స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్‌వర్క్‌కు అనుసంధానించి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పీజీసీఐఎల్ నెట్‌వర్క్ సామర్థ్యం 17,000ల మెగావాట్ల వరకు ఉంది. అదనంగా వచ్చే కరెంట్‌ను సరఫరా చేసేందుకు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాయలసీమలో కొత్తగా మరో 10,000ల మెగావాట్ల పునరుత్పాదక, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వాటినుంచి వచ్చే కరెంట్‌ను సరఫరా చేసేందుకు అదనపు నెట్‌వర్క్ అవసరం. దీనికోసం కర్నూలు నుంచి విశాఖ వరకు 1200ల సర్క్యూట్ కిలోమీటర్లు ప్రత్యేక విద్యుత్ లైన్లు వేయాలని ప్రతిపాదించారు. పీజీసీఐఎల్‌కు చెందిన ఓర్వకల్లు, గనిలోని 765 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు ట్రాన్స్‌కోకు చెందిన ఆస్పిరి, కృష్ణపట్నం, పొదిలి, రామాయపట్నం, సత్తెనపల్లి, వేమగిరి, గుడివాడ, కాకినాడ, గంగవరం, నక్కపల్లి కలిపి మొత్తంగా 17 సబ్‌స్టేషన్లను అనుసంధానించాలన్నది ఆలోచన. కొత్తగా పెందుర్తి దగ్గర మరో సబ్‌స్టేషన్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు.
పూడిమడక దగ్గర భారీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు : విశాఖలోని పూడిమడక దగ్గర భారీ గ్రీన్ హైడ్రోజన్ పార్కును ఎన్‌టీపీసీ, జెన్‌కో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇక్కడ నెలకొల్పే గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులకు భారీగా విద్యుత్ అవసరం. ఆ పునరుత్పాదక కరెంట్‌ను రాయలసీమలో స్థాపించే ప్రాజెక్టుల నుంచి తీసుకునేందుకు గ్రీన్ కారిడార్ ఉపయోగపడుతుందని అధికారుల అంచనా.
ఎస్‌ఆర్‌పీసీ ఆమోదించిన ప్రతిపాదనలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పవర్ గ్రిడ్ సంయుక్తంగా వేసిన కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం నేషనల్ కమిటీ ఫర్ ట్రాన్స్‌మిషన్‌కు పంపించి, అక్కడ ఆమోదం లభించిన తరువాత ప్రాజెక్టు అమలుకు అనుమతులు వస్తాయి. కేంద్రం నుంచి సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.