తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

నాగ సాధువులకు ఆ శక్తి ఎలా వస్తుంది? - గడ్డకట్టే చలిలోనూ ఎలా ఉండగలుగుతున్నారో తెలుసా? - HOW NAGA SADHUS SURVIVE

హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో నాగ సాధువులు - ఒంటిపై వస్త్రం కూడా ఉండదు - మరి ఆ శక్తి వారికి ఎలా వస్తుంది?

Naga Sadhu Praying In Himalayas
Naga Sadhu Praying In Himalayas (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2025, 5:10 PM IST

How Naga Sadhus Survive In Himalayas : నేడు ప్రపంచమంతా మాట్లాడుకునేది ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా గురించే! అన్ని దారులు ప్రయాగ్‌రాజ్‌ వైపే! ఎవరి నోట విన్నా కుంభమేళా సంగతులే! ఈ నేపథ్యంలో మహా కుంభ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నాగ సాధువుల గురించి అద్భుతమైన వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ నాగ సాధువులు వస్త్రాలు ధరించరు. అయితే ప్రయాగ్‌రాజ్‌లో గడ్డ కట్టే చలిలో కూడా వారు ఎలా ఉండగలుగుతున్నారు? దీని వెనుక ఉన్న వారి కఠోరమైన సాధన ఏంటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రహస్యమిదే!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13వ తేదీ, పుష్యపౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమైంది. 144 ఏళ్లకు ఓ సారి మాత్రమే జరిగే మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. తెల్లవారుజాము నుంచే గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగ సాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

మహాకుంభ మేళాలో నాగ సాధువులు (Associated Press)

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నాగ సాధువులు
వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహా కుంభ మేళాకు హాజరైన నాగ సాధువులు. ప్రయగరాజ్‌లో తీవ్రమైన చలి ఉండడం వల్ల సాధారణ భక్తులు స్నానమాచరించే సమయంలో గజగజ వణికిపోతున్నారు. నాగ సాధువులు మాత్రం ఎలాంటి వస్త్రాలు ధరించకుండా గడ్డకట్టించే చలిని తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అంతేకాదు ఈ నాగ సాధువులు సాధారణంగా అన్ని కాలాల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కుంభ మేళా సమయంలో మాత్రమే వీరు జనావాసాలలోకి వచ్చి మళ్ళీ తిరిగి హిమాలయాలకు వెళ్లిపోతుంటారు. మైనస్ డిగ్రీల చలినీ సహించగల శక్తి నాగ సాధవులకు ఎలా వచ్చిందో చూద్దాం.

విభూతే ఆహార్యం!
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలిరోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వస్త్రాలు వేసుకోకుండా కేవలం విభూతి ధరించే వీరికి తీవ్రమైన చలిని భరించగలిగే సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తులు ఆశ్యర్యంతో నోరెళ్లబడుతున్నారు.

మహాకుంభ మేళాలో పవిత్ర స్నానాలు చేస్తున్న నాగ సాధువులు (Associated Press)

అసలు నాగాలు ఎప్పటి నుంచి ఉన్నారు?
శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించిన తర్వాత, వాటి భద్రత గురించి ఆందోళన చెంది, నాగ సాధువుల బృందాలను ఏర్పాటు చేశారని అంటారు.

అసామాన్యమైన కఠోర దీక్ష
నాగ సాధువుగా మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా, నాగ సాధువులు 'హఠ యోగా'ను అభ్యసిస్తారు. ఈ సారి మహా కుంభ మేళాకు హాజరైన కొందరు నాగ సాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమవైపు తిప్పుకున్నారు. ఒక నాగ సాధువు అనేక సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. నాగ సాధువులు ఎంత అంకితభావంతో ఉంటారో చెప్పేందుకు ఇదో గొప్ప నిదర్శనం.

నాగ సాధువులకు చలి ఇందుకే వేయదు!
సున్నా డిగ్రీల చలిలోనూ వస్త్రాలు ధరించని నాగ సాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురికారు. వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నా ఇదే నిజం! వైద్య అధ్యయనాల ప్రకారం, మానవులు సరైన దుస్తులు లేకుండా మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2.5 గంటలు మాత్రమే జీవించగలరు. రెండు పొరల దుస్తులతో వారు 15 గంటలు జీవించగలరు. అయితే, నాగ సాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలుగుతున్నారు. తమ రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యం వెనకాల రహస్యమని నాగ సాధువులు చెబుతున్నారు. అన్ని రుతువులను తట్టుకోవడానికి నాగ సాధువులు ఈ 3 రకాల సాధనలను చేస్తారు.

  1. అగ్ని సాధన :నాగ సాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.
  2. నాడీ శోధన :ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రతను అన్ని కాలాల్లో క్రమబద్ధంగా, వెచ్చగా ఉండేలా చూస్తుంది.
  3. మంత్ర పఠనం :నాగ సాధువులు నిరంతరం మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది.

విభూతి యోగం :నాగ సాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే విభూతిలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి. అంటే విభూతి ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details