HOROSCOPE 2025 IN TELUGU : 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే
మేషం (Aries) :మేషరాశి వారికి 2025 సంవత్సరం ఫలవంతంగా ఉండబోతోంది. నూతన సంవత్సరం ఆరంభంలో అన్ని రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త ఏడాదిలో మీ కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. ప్రేమికుల ప్రేమబంధం దృఢపడుతుంది. వివాహబంధంతో ఒక్కటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుటుంబంలో తలెత్తే స్వల్పమైన మనస్పర్థలు సమయానుకూలంగా నడుచుకునే సమసిపోతాయి. గతంలో కంటే ఖర్చులు కొంత మేర పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగినప్పటికిని ఆదాయం గణనీయంగా పెరగడంలో ఆర్థిక పరిస్థితి ఉహించనదానికన్నా మెరుగ్గా ఉంటుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. అనేక మార్గాల నుంచి డబ్బు వచ్చి చేరుతుంది. స్థిరాస్తులు, షేర్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందుతారు. మీ పనితీరుతో ఇతరులను ఒప్పించే సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టులను సులువుగా పొందుతారు. వృత్తిపరంగా చుస్తే అద్భుతమైన పురోగతికి అనుకూల సమయం. వ్యాపారులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. వ్యాపార భాగస్వామితో సంబంధాలు మెరుగు పడడం వల్ల లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగులకు జీతాలు పెరగడం, ప్రమోషన్లు పొందడం వంటి అవకాశాలు ఉన్నాయి. పని ప్రదేశంలో ఏర్పడే చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళ్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సామాజికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇతరులు అసూయపడేలా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తిపరంగా ఎదగడానికి చేసే అన్ని ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. పరోపకారంతో వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. రుణభారం తగ్గుతుంది. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది. విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురైనా కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏకాగ్రత అవసరం. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి అనుకూలమైన సమయం. విదేశాలలో చదవాలన్న మీ చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా అనారోగ్యాన్ని నివారించవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలన్న మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం వృషభ రాశి వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మీ కలలు, కోరికలు అన్నీ నెరవేరి, ఈ సంవత్సరం మీకు సంతోషం, విజయాలను అందిస్తుంది. మీ అంచనాలు, ప్రణాళికలు విజయవంతమై వృత్తిపరంగా ముందడుగు వేస్తారు. సాధించిన విజయాలతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందగలరు. కీలకమైన వ్యవహారాల్లో ఉత్తమ నిర్ణయాల తీసుకోవడం ద్వారా వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతుల్యంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్తపడాలి. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారంలో పెట్టుబడుల నుంచి గణనీయమైన లాభాలు పొందుతారు. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్డు. ఆదాయం పెరగడం వల్ల భవిష్యత్ ప్రణాళికలు జోరందుకుంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరిగినప్పటికిని కష్టించి పనిచేస్తే విజయం ఉంటుంది. విద్యార్థులకు కొంత కఠినమైన సమయం. తీవ్రమైన కృషితోనే సత్ఫలితాలు ఉంటాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. వృధా ఖర్చులు నివారిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. తగినంత వ్యాయామం, విశ్రాంతి ప్రయోజనకరంగా ఉంటాయి. క్రీడారంగం వారు ఈ సంవత్సరం గణనీయమైన విజయాలు, గుర్తింపులు పొందే అవకాశముంది. శివారాధన, అభిషేకాలు మేలు చేస్తాయి.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రాశి వారు ఎక్కువగా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. దైవదర్శనం కోసం పవిత్ర ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ ఏడాది పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో కుటుంబలో అనుకోని సవాళ్లు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా తరచూ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో పరస్పర వివాదాలు, విభేదాలు తలెత్తవచ్చు. క్రమంగా విభేదాలు తగ్గుముఖం పట్టి వైవాహికజీవితంలో ఆనందం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు కెరీర్ పరంగా, ఈ సంవత్సరం అనేక నూతన అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగంలో మార్పులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తికి సంబంధించిన సవాళ్లు కూడా ఎదురవుతాయి. మీ ప్రతిభను ప్రదర్శించేందుకు, మీ కెరీర్‌లో రాణించేందుకు ఇది మంచి సమయం. విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా పుషకాలంగా ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి కన్న కలలు ఈ ఏడాది నిజమవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయాన్ని సాధించడానికి సరైన సమయం. వ్యాపారులు ఈ ఏడాది శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారు ఈ సంవత్సరం ప్రారంభంలో విదేశీ వ్యాపార అవకాశాలను పొందవచ్చు. ఈ అవకాశాలు మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త పరిచయాలను ఏర్పరచడానికి సహాయపడతాయి. సంవత్సరం ద్వితీయార్థంలో కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆంజనేయ స్వామి ప్రార్థన, హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి 2025 సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ ఏడాది ఆరంభంలోనే వృత్తి పరంగా శుభ ఫలితాలను అందుకుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో నైపుణ్యాలు వృద్ధి చేసుకోడానికి అనుకూలమైన సమయం. అధికమైన పనిభారంతో కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది కానీ సహచరుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో మెరుగైన పురోగతి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి శుభ సమయం. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి, ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్యపరంగా చూస్తే సంవత్సరం ప్రారంభంలో కొంత శ్రద్ధ అవసరం. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పరిష్కరించాలి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఈ సంవత్సరం మీ విజయానికి ఒక శుభ సంకేతం. మీకు ప్రతిభ ఉన్న రంగాలలో రాణించి మంచి ఫలితాలను సాధించడానికి సరైన సమయం. వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో తలెత్తే మనస్పర్థలు ఒత్తిడిని పెంచవచ్చు. ఈ సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించడం ద్వారా కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థికంగా, 2025 సంవత్సరం మీకు సుభిక్షంగా ఉంటుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం. ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆర్థిక స్థితిని బలోపేతం అవుతుంది. అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. మీ కలలు, ఆశయాలు సాకారమవుతాయి. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రాజకీయరంగంలో ప్రవేశించాలనుకునే వారు అనిభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఇష్ట దైవారాధన, ఇష్ట దేవత ఆలయ సందర్శన శుభప్రదం.
సింహం (Leo) :సింహరాశి వారికి 2025 సంవత్సరం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం ప్రేమ వైవాహిక సంబంధాలలో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఆనందం నెలకొంటుంది. సంవత్సరం మధ్యలో కొన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ క్రమేణా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో గణనీయమైన మార్పులకు దారి తీస్తుంది. ఈ మార్పులు మీకు అనేకరకాలుగా మేలు చేస్తాయి. సన్నిహితుల ప్రేరణతో కొత్త అవకాశాలు అందుకుంటారు. కుటుంబంలో అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారా సంబంధాలు బలపడతాయి. సంతానం పురోగతి గొప్ప ఆనందాన్ని అందిస్తుంది. తద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో ఊహించని విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు మీరు గడించిన అనుభవం, తెలివితేటలు ప్రదర్శించేందుకు ఇది మంచి సమయం. ముఖ్యంగా సంవత్సరం చివరిలో కెరీర్ పురోగతికి మంచి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పకుండా పెట్టాలి. మీ కృషితో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సరైన సమయం. ఆదాయాన్ని మించిన ఖర్చులు పొదుపుకు అవరోధంగా మారవచ్చు. చక్కని ప్రణాళికతో ఆర్థిక సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చు. మతపరమైన కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయం అందుకుంటారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు ఈ సంవత్సరం తమ ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించి మంచి పురోగతిని సాధించగలరు. సంవత్సరం ప్రారంభంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. సంవత్సరం చివరలో విదేశాలకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి, ఈ సంవత్సరం సింహరాశి వారికి సవాళ్లతో పాటు అనేక అవకాశాలను అందిస్తుంది. సానుకూల ఆలోచనలు, ఆశావాదం విజయానికి కీలకంగా ఉంటాయి. శ్రీలక్షిమి దేవి ఆరాధన, కనకధారాస్తోత్రం పారాయణ శుభకరం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి 2025 సంవత్సరం సామాన్య ఫలితాలను అందించనుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి, వృత్తిలో అస్థిరతను ఉండవచ్చు. సంవత్సరం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. సహనంతో ఉంటే నిదానంగా అయినా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సోదరులు, ఇతర కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అపార్థాలు, అపోహలు ఏర్పడవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే సవాళ్లను అధిగమించవచ్చు. వ్యాపారులు వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలిక ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయవచ్చు. సంవత్సరం మధ్యలో అదృష్టం అనుకూలించి ఆగిపోయిన ప్రాజెక్టులు పునఃప్రారంభమవుతాయి. వృత్తిపరంగా, మీ పనితీరు మెరుగు పడుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడదు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సంవత్సరం మధ్యలో దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదనపు కృషి, ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షల్లో సవాళ్లు ఎదురైనా, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్య పరంగా శ్రద్ధ వహించాలి. శ్రీ సుంబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవడం ఉత్తమం.
తుల (Libra) :తులారాశి వారికి 2025 సంవత్సరం శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశివారికి ఈ ఏడాది అన్ని విధాలా అనుకూలమైన సమయం. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం, ఆర్థికవృద్ధి ఉంటాయి. ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో ఉత్సాహంతో, ధైర్యంతో పనిచేసి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. వృత్తి పరంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొడతారు. వ్యాపారులు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది, తెలివిగా వ్యవహరించి పెద్ద డీల్‌లను సులువుగా పూర్తిచేయడంలో విజయం సాధిస్తారు. సమావేశాలలో, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకర్షిస్తారు. ప్రేమికులు వివాహబంధంతో ఒక్కటవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో గృహ జీవితంలో కొన్ని సవాళ్లు తలెత్తవచ్చు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులు పట్టుదలతో, ఏకాగ్రతతో చదివితే విజయం సులువుగా చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది. భూములు, ఆస్తులు కొనుగోళ్లు చేస్తారు. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయస్వామి దండకం పఠించడం మేలు.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి 2025 వ సంవత్సరం గొప్ప శుభ ఫలితాలను అందించనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అన్ని రంగాల వారికి అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల పట్టుదలతో పనిచేసి విజయాలను అందుకుంటారు. మీ మేధస్సు, తెలివితేటలతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. వృత్తి పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి తిరుగులేని మద్దతు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. ఈ యాత్రల ద్వారా మీ మధ్య అనుబంధం దృఢపడుతుంది. వృత్తి పరంగా, ఈ సంవత్సరం మంచి అవకాశాలను అందుకుంటారు. కొత్త ఉపాధికి అవకాశాలు మెరుగవుతాయి. వీటి ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ప్రమోషన్లు, స్థానచలనం ఉండవచ్చు. పనిప్రదేశంలో సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండడం అవసరం. వ్యాపార రంగంలో ఈ సంవత్సరం గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. భాగస్వాముల సహకారంతో మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు నైపుణ్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా మంచి విజయాలను సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో, ఈ సంవత్సరం గణనీయమైన మార్పులను తీసుకురావచ్చు. ఒక కొత్త ప్రదేశానికి స్థానచలనం లేదా గణనీయమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ సంవత్సరం ప్రారంభంలో అనుకూల అవకాశాలు లభిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించడం, విష్ణువు ఆలయ సందర్శన శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అన్ని రంగాల వారికి వృత్తి పరంగా సవాళ్లతో పాటు, అరుదైన అవకాశాలను కూడా అందిస్తుంది. ఈ రాశి వారు సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. ముఖ్యంగా ప్రయాణాలు లేదా డ్రైవింగ్ వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లేదా గాయాలు సంభవించే అవకాశం ఉన్నందున, డ్రైవింగ్‌లో అదనపు జాగ్రత్త అవసరం. ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకు, కొంత కఠినమైన సమయం. పనిభారం పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల లోపిస్తుంది. అనారోగ్యం కారణంగా చేసే పనిపై ఆసక్తి లేకపోవడం వృత్తిపరమైన సమస్యలకు దారి తీస్తుంది. మీ ప్రత్యర్థులు బలపడే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా నిలవడం ముఖ్యం. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. అంతర్జాతీయ వ్యాపారాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొనాలంటే వ్యక్తిగత అహంకారాన్ని పక్కన పెట్టడం అవసరం. విహారయాత్రలతో జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందుకుంటారు. సంవత్సరం ప్రారంభంలో అంతర్జాతీయ అధ్యయనాలకు అనుకూలమైన అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక పరిస్థితిసామాన్యంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. నవగ్రహాలకు అభిషేకాలు జరిపించడం, ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఈ కొత్త సంవత్సరం మకరరాశి వారికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికినీ అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా కష్టించి పనిచేస్తే విజయాలకు కూడా అవకాశం ఉంది. ఆర్థికంగా బలోపేతం కావాలంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఉద్యోగులు అదనపు ఆదాయం మార్గాలను పొందుతారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులు తమ భాగస్వాములతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా విజయాలను పొందగలరు. వ్యాపారంలో పోటీదారుల నుంచి సమస్యలు ఎదురైనా క్రమేణా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవు. ఆర్ధిక స్థిరత్వం సంతృప్తినిస్తుంది. మీరు చేపట్టిన అన్ని పనులకు కుటుంబం నుంచి మద్దతు ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఫలవంతంగా ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అన్ని రంగాల వారికి వృత్తి పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి. వైవాహిక జీవితంలో అనవసరమైన అపార్థాలు సమస్యలకు దారితీయవచ్చు. సంవత్సరం ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగు పడతాయి. శని దేవుడి ఆశీర్వాదంతో వృత్తిపరమైన లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. అవసరానికి సరిపడా ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి, మీ ధైర్యమే మీ విజయానికి కీలకంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో, సంవత్సరం ప్రారంభంలో గణనీయమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులుపై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్‌తో పాటు నచ్చిన చోటికి బదిలీ పొందే అవకాశం కూడా ఉంది. మీ మెరుగైన పనితీరు, స్వీయ క్రమశిక్షణ మీకు తిరుగులేని విజయాలను అందిస్తుంది. వ్యాపారులు వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధించి లాభాల బాట పడతారు. కొత్త ఒప్పందాలు, ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు అందుకుంటారు. ఓవర్సీస్ వ్యాపార అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా, ఈ సంవత్సరం మీకు గొప్ప అదృష్టాన్ని మోసుకువస్తోంది. కొత్త పథకాలలో పెట్టుబడి పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్‌లో పొదుపు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది. ఆరోగ్యపరంగా, సంవత్సరం ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు అవసరం, ఇవి ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఈశ్వరుని ఆలయ సందర్శన, శివ పంచాక్షరీ మంత్రజపం మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు సవాళ్లతో పాటు అవకాశాలను కూడా అందుకుంటారు. ముందస్తు ప్రణాళికతో పురోగతి సాధ్యం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణభారం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా జాగ్రత్త పడడం అవసరం. వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు, విబేధాలతో కలత చెందుతారు. ఈ గొడవలు మీ బంధంపై ప్రభావం చూపవచ్చు. పెద్దల ప్రమేయంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే మంచిది. అహంకారంపై అదుపు సాధిస్తే ప్రేమ విషయాలు వివాహానికి దారితీస్తాయి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు ఉండవచ్చు. విద్యార్థులు కఠోర శ్రమతోనే విజయం సాధించగలరు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి సమయం అనుకూలంగా ఉంది. ఖర్చులు కూడా విపరీతంగా ఉండవచ్చు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఇతరుల మద్దతు అవసరం అవుతుంది. అయితే అవసరమైన చోట మాత్రమే మద్దతు కోరడం సబబుగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం శ్రేయస్కరం.