Hanuman Jayanti 2024 Date : హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో 'హనుమాన్ జయంతి' ఒకటి. ప్రతీ సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజును దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. అయితే.. ఈ సంవత్సరం హనుమన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. మరి ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏ రోజున వచ్చింది? ఆ రోజున భక్తులు ఏం చేయాలి? వంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం.
ఈ సారి హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది?
హిందూ పురాణాల ప్రకారం.. హనుమంతుడు మంగళవారం రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే మంగళవారం రోజున చాలా మంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అయితే.. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజున వచ్చింది. దీంతో.. ఈ సారి వచ్చే హనుమాన్ జయంతి ఎంతో శుభప్రదమైనదని పండితులు చెబుతున్నారు.
వేద పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం ఏప్రిల్ 23 తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఆ రోజున తెల్లవారుజామున 03.25 గంటలకు నుంచి చైత్రపూర్ణిమతిథి ప్రారంభమై, ఏప్రిల్ 24 బుధవారం ఉదయం 05:18 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:20 నుంచి 05:04 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 11:53 నుంచి 12:46 వరకు అభిజీత్ ముహూర్తం ఉంటుంది.