Guru Dosha Remedies In Telugu : వరాహ మిహిరుడు రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే జాతకం ప్రకారం గురు గ్రహం బలంగా ఉండడం అవసరం. జాతకంలో గురువు నీచంగా ఉంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే బృహస్పతి కళ్యాణకారకుడు. జాతకంలో గురు స్థానం బలంగా ఉంటేనే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు జాతకంలో గురు స్థానం ఎలా ఉందో చూసుకొని ఒకవేళ బలహీనంగా ఉంటే దానికి తగిన పరిహారాలు చేసుకోవడం ద్వారా బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చునని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
గురుదోషాలను పోగొట్టే శ్రీహరి పూజ
హిందూ సనాతన ధర్మం ప్రకారం గురువారం శ్రీహరి పూజకు విశిష్టమైనది. విష్ణువును ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. గురుగ్రహ అనుకూలత కోసం గురువారం కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలని శాస్త్రం చెబుతోంది. అవేమిటో చూద్దాం.
గురువారం నియమ నిష్టలతో విష్ణువును పూజిస్తే ఇటు విష్ణువు అనుగ్రహంతో దేవ గురువు బృహస్పతిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. హిందూ మత విశ్వాసం ప్రకారం అరటి చెట్టు బృహస్పతికి నెలవు. అదే పురాణాల ప్రకారం అయితే అరటిచెట్టు విష్ణువుకు ఆవాసం. అందుకే గురువారం అరటి చెట్టును పూజించే ఆచారముంది. గురువారం మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించే పండ్లలో అరటిపండ్లును తప్పని సరిగా చేర్చాలి. అయితే గురురువారం పొరపాటున కూడా అరటిపండ్లు తినరాదు. అలా చేస్తే గురుదోషం ఏర్పడుతుంది.