Shri Girijatmaj Lenyadri Ganpati Temple Maharashtra: హిందూ సంప్రదాయం ప్రకారం విఘ్నేశ్వరుని పూజించనిదే ఏ పనిని మొదలు పెట్టరు. మహారాష్ట్ర లో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఆరవ క్షేత్రం గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం. ఈ ఆలయంలో వినాయకుని దర్శించి పూజిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకుందాం.
బౌద్ధ గుహల మధ్య వెలసిన ఆలయం
శ్రీ గిరిజాత్మజ్ గణపతి దేవాలయం ఒక చిన్న కొండపై ఉన్నందున దీనిని గణేష్ గుఫా అని కూడా అంటారు. ఈ ఆలయంలో గణేష్ విగ్రహం చిన్న పిల్ల వాని రూపంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం విలక్షణమైన బౌద్ధ సంప్రదాయంలో ఉన్నందున బౌద్ధ గుహలు, హిందూ దేవాలయం కలిసి ఉన్నట్లుగా కనిపించే చిత్రమైన ఆలయంగా గిరిజాత్మజ్ గణపతి ఆలయం విరాజిల్లుతోంది.
పురాతన ఆలయం
క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందినదని భావించే ఈ గిరిజాత్మజ్ గణపతి దేవాలయం చేరుకోవడానికి చేరుకోవడానికి 300 పైగా మెట్లు ఉంటాయి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే విద్యుద్దీపాల అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం వల్ల సూర్యకాంతిలో ప్రశాంతంగా గణనాధుని దర్శించుకోవచ్చు.