Astrological Remedies for Successful Career : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తమ, తమ రంగాల్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడినా చేసే పనిలో విజయం వరించదు! దాంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. అలాంటి సందర్భాల్లో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఎంతటి కష్టమైన పనిలోనైనా తప్పక విజయంసాధిస్తారంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. మీ కెరీర్ కూడా విజయపథంలో దూసుకెళ్తుందంటున్నారు. మరి, ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.
- ఏదైనా పనిలో విజయం సాధించాలంటే "సర్వరక్షాకంకణం" అనే కంకణాన్ని చేతికి ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
- ఈ కంకణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో రెండు గరిక పోసలు, కొన్ని కుంకుమ కలిపిన అక్షింతలు, ఒక రాగి నాణెం ఉంచి ముడివేసుకోవాలి. ఆపై దాన్ని ఏ నెలలోనైనా సరే పౌర్ణమి తిథి నాడు చేతికి ఒక రక్షలాగా కట్టుకోవాలి. దీన్నే సర్వరక్షా కంకణం లేదా కార్య సిద్ధి కంకణంగా పిలుస్తారు. ఇంట్లో ఎవరైనా దీన్ని ధరించవచ్చు.
- మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు కుడిచేతికి ఆ కంకణాన్ని కట్టుకొని వెళ్తే అందులో తప్పకుండా మంచి ఫలితం పొందుతారంటున్నారు.
- ఈ పరిహారం కూడా మీ పనులు విజయవంతమవ్వడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అదేంటంటే, గణపతిని ఎర్రటి పుష్పాలు, గరిక పోచలతో పూజించాలి. పూజ పూర్తయ్యాక గణపతికిసమర్పించిన ఆ గరిక పోచలలో కొన్నింటిని మీ దగ్గర పెట్టుకొని వెళ్లాలి. మీ పని పూర్తై వచ్చాక ఆ గరిక పోచలను ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలంటున్నారు.
- మీరు అనుకున్న ఒక పని ఎన్నిసార్లు వెళ్లినా పూర్తి అవ్వట్లేదు. ఏదో ఒక అటంకం కలుగుతోందన్నమాట. అలాంటి సందర్భంలో ఆంజనేయస్వామిఆలయానికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేసి బెల్లం, నెయ్యిని నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరైనా పిల్లలకు అరటిపండ్లు పంచి పెట్టి మీ పని మీద వెళ్లండి. అప్పుడు ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- ఏదైనా పెద్ద పని పూర్తవ్వడం కష్టమైనట్లు అనిపించిన సందర్భాల్లో ఆంజనేయస్వామి గుడిలో పైన చెప్పిన విధంగా 9 మంగళవారాలు చేస్తే మంచి ఫలితం పొందుతారంటున్నారు.
- తిథి, వారాలు బాగోలేనప్పుడు ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్లినప్పుడు అది సక్సెస్ అవ్వాలంటే గొడుగు దగ్గర పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతుందంటున్నారు.
- అదేవిధంగా, తరచూ బుధవారం ఉత్తర దిక్కుకి తిరిగి జామకాయలు దానం ఇస్తుండడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో సక్సెస్ త్వరగా వస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
నోట్ :పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.