తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మాస శివరాత్రి అంటే ఏమిటి? గ్రహ దోషాలు పోవాలంటే ఎలా పూజించాలి? - MASA SHIVARATRI NOVEMBER

ఏలినాటి శని, అర్ధాష్టమ శని, గ్రహ దోషాలు పోగొట్టే మాస శివరాత్రి పూజ - తేదీ, సమయం, పూజా విధానం మీకోసం!

Masa Shivaratri November 2024
Masa Shivaratri November 2024 (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 5:36 PM IST

Masa Shivaratri Puja Vidhi : వివాహంలో జాప్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు వంటి సమస్యలతో ఇబ్బంది పడటానికి కారణం జాతకం ప్రకారం గ్రహ దోషాలు ఉండడమే! ఇలాంటి గ్రహదోషాలు నుంచి విముక్తి కలిగించడానికి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మాస శివ రాత్రికి చాలా ప్రాముఖ్యం ఉంది. మాస శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే గ్రహ దోషాలు పోతాయని, కోరిన కోరికలు నేరవేరతాయని నమ్మకం. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? ఈ రోజు ఎవరిని పూజించాలి? పూజా విధానమేమిటి అనే విషయాలను తెలుసుకుందాం.

మాస శివరాత్రి అంటే!
తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివ రాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పర్వ దినంగా జరుపుకుంటాం. అయితే మాస శివరాత్రి జరుపుకునే రోజు రాత్రి సమయంలో చతుర్దశి తిథి తప్పకుండా ఉండాలి.

మాస శివరాత్రి ఎప్పుడు?
కార్తిక బహుళ చతుర్దశి నవంబర్ 29వ తేదీ ఉదయం 8:39 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే నవంబర్ 30వ తేదీ ఉదయం 10:29 గంటలకు ముగుస్తుంది. మాస శివరాత్రి జరుపుకోవాలంటే రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉండాలి. అందుకే కార్తిక మాస శివ రాత్రిని నవంబర్ 29 శుక్రవారం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి
పరమశివుడు లయ కారకుడు. అంటే సృష్టిని అంతం చేసే వాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనః కారకుడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్ర బలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యు కారకుడు. అందుకే చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో వారి ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాస శివరాత్రి రోజు శివుని ఆరాధిస్తే కేతు గండాలు తొలగిపోతాయని విశ్వాసం.

మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచియై ఇంట్లో పూజాదికాలు ముగించుకొని శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్ళాలి.

  • మాస శివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసం, పంచామృతం, పచ్చి పాలు, గంగాజలం, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగుతో అభిషేకం జరిపించాలి.
  • అష్టోత్తర శత నామాలతో శివయ్యని అర్చించాలి. పూజ సమయంలో శివలింగానికి పూలు, బిల్వపత్రం, తుమ్మి పూలు, ఉమ్మెత్త, భస్మం, చందనం మొదలైన వాటిని సమర్పించాలి.
  • శివయ్యకు పండ్లు, కొబ్బరికాయలు, ఎండుద్రాక్ష వంటి నైవేద్యాలు సమర్పించాలి.
  • శివాలయంలో ప్రశాంతంగా కూర్చుని శివతాండవం, అర్ధ నారీశ్వర స్తోత్రం, శివాష్టకం వంటివి పఠించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఈ దానాలు శ్రేష్టం
మాస శివరాత్రి రోజు సద్బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్ర దానం చేయడం మంచిది. ఇది కార్తిక మాసం కాబట్టి ఈ రోజు విశేషించి దీప దానం, సాలగ్రామ దానం చేయడం వలన అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం.

మాస శివరాత్రి పూజాఫలం
మాస శివ రాత్రిని ఈ విధంగా శాస్త్రోక్తంగా జరుపుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. జాతకంలోని క్షీణ చంద్ర దోషముల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. రాహు కేతు గండాలు తొలగిపోయి సంతానలేమి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. రానున్న మాస శివరాత్రిని మనం కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. ఆ పరమశివుని అనుగ్రహం తో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details