Vijaya Ekadashi 2025 :తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో 24 ఏకాదశుల ఉంటాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే. మాఘమాసం కృష్ణ పక్షంలో శివరాత్రి ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. సాధారణంగా ఏ ఏకాదశి రోజు అయినా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ సందర్భంగా విజయ ఏకాదశి ఏ రోజు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి? విజయ ఏకాదశి వ్రతఫలం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయ ఏకాదశి విశిష్టత
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలో, వాల్మీకి రామాయణంలోను విజయ ఏకాదశి ప్రస్తావన ఉంది. విజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చేపట్టిన పనిలో విజయం తథ్యం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
విజయ ఏకాదశి ఎప్పుడు
మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా జరుపుకుంటాం. ఫిబ్రవరి 23 వ తేదీ మధ్యాహ్నం మాఘ బహుళ ఏకాదశి తిధి 1:56 నిమిషాలకు మొదలై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24 వ తేదీ మధ్యాహ్నం 1:45 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి 24 వ తేదీనే విజయ ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం.
విజయ ఏకాదశి పూజ విధానం
విజయ ఏకాదశి వ్రతం ఆచరించేవారు సూర్యోదయం వేళ నదీస్నానం చేయడం శ్రేష్టం. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో శ్రీలక్ష్మీనారాయణ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలి. గంథం, కుంకుమ పసుపు రంగు పూలతో శ్రీలక్ష్మీనారాయణ విగ్రహాలను అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి. అనంతరం కొబ్బరికాయ, అరటిపండ్లు, పాయసాన్నం, పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేనివారు పూజ పూర్తయ్యాక పాలు పళ్లు వంటి సాత్విక ఆహరం తీసుకోవచ్చు. ఈ విధంగా విజయ ఏకాదశి పూజ పూర్తయ్యాక వ్రతకథను చదువుకొని అక్షింతలు శిరస్సున వేసుకోవాలి. అప్పుడే ఏకాదశి వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది.
దేవాలయంలో ఇలా
విజయ ఏకాదశి రోజు సాయంత్రం సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించాలి. ఆలయంలో భజనలు, కీర్తనలు, భగవత్ కథాకాలక్షేపాలతో రాత్రంతా జాగారం చేయాలి.