Tirumula Brahmotsavalu Hanuma Vahanam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు (అక్టోబర్ 9వ తేదీ)న ఉదయం శేషాచలాధీశుడు - శ్రీరాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకే హనుమ వాహన సేవ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
భక్తికి పరాకాష్ట
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యులు. భక్తికి పరాకాష్ట హనుమత్ తత్వం. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతునిగా, లంకాభీకరునిగా ప్రసిద్ధుడైన ఆంజనేయ స్వామి, వేంకటాద్రి వాసుని మోపున వహించి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక బ్రహ్మోత్సవాలలో వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.