తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మకరజ్యోతి స్పెషల్- ఏపీలోనే ఫస్ట్ అయ్యప్ప గుడి విశేషాలు మీకోసం! - THUMMAGUNTA AYYAPA SWAMI TEMPLE

శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన అయ్యప్ప గుడి - ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి అయ్యప్ప దేవాలయం-మ్మగుంట శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రం విశేషాలివే!

Thummagunta Ayyapa Swami Temple
Thummagunta Ayyapa Swami Temple (ETV)

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 4:27 AM IST

Thummagunta Ayyapa Swami Temple :మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో దర్శనమిచ్చే మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. దీక్షాధారులై శబరిమలకు వెళ్లలేని వారు ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మగుంట గ్రామంలో వెలసిన శ్రీ గురునాధస్వామి ఆలయంలో నిర్వహించే జ్యోతి దర్శనం చూడటానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ఈ గురునాధ స్వామియే అయ్యప్ప స్వామి. ఈ సందర్భంగా తుమ్మగుంట శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆలయ స్థల పురాణం
15వ శతాబ్దంలో జరిగిన సంఘటన. శ్రీ కృష్ణదేవరాయలు వారు దక్షిణ భారతదేశంలో దిగ్విజయ యాత్ర చేస్తూ తుమ్మగుంట క్షేత్రమున కొంత సమయం విశ్రాంతి తీసుకొని నిద్ర పోవుచుండగా స్వప్నమున అయ్యప్ప స్వామి కనబడి, తను ఈ క్షేత్రములో ఒక జువ్వి చెట్టులో వెలసి ఉన్నానని, తనకు ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేత పూజలు చేయించమని అయ్యప్ప స్వామి కలలో తెలిపిరి.

స్వప్నంలోనే స్వామిని ప్రశ్నించిన కృష్ణ దేవరాయలు
అయ్యప్ప స్వామిని కలలోనే రాయలవారు 'స్వామి మిమ్మల్ని ఎలా గుర్తించాలి అని అడుగగా, అయ్యప్ప స్వామి వారు ఆ ప్రాంతంలో ఉండే ఒక మామిడి తోటలో వుండే ఒక జువ్వి వృక్షములలో తాను ఉన్నానని, ఆ వృక్షము పవిత్రమైన సుగంధ ద్రవ్యముల సువాసనలతో విరాజిల్లుతుందని, అదే విధముగా తనను దర్శించిన సమయంలో దివ్యమైన కాంతులతో రాయలవారికి దర్శనమిస్తానని' అయ్యప్ప స్వామి రాయల వారికి స్వప్నములో తెలిపారు.

స్వప్న విశేషాలు పరివారానికి తెలిపిన రాయలు
నిద్ర మేలుకొనిన రాజు గారు తనకు వచ్చిన కలను తన పరివారములో ఉన్నటువంటి నిత్యాగ్ని హోత్రులు వేద పండితులు మంత్రోపాసకులు అయినట్టు వంటి తామ్రపర్ణి నది తీరమున నివసించే కాండ్ర మాణిక్య అగ్రహారీకులు అయినట్టు వంటి బ్రాహ్మణోతములకు తెలుపగా వారు రాయలవారితో "మహారాజా మీరు చాలా అదృష్టవంతులు స్వామి వారు కలలో మీకు దర్శనం ఇచ్చారు కాబట్టి స్వామి వారి ఆదేశానుసారం మనం ఆ మామిడితోటలో జువ్వి వృక్షాన్ని దర్శనం చేసుకుందాం" అని మహారాజుకి తెలిపిరి.

రాయలకు దర్శనమిచ్చిన అయ్యప్ప
తక్షణము రాయలవారు తన పరివారంతో కలిసి మామిడి తోటలో వెతుకగా దేదీప్యమైన కాంతులతో దివ్యమైన సుగంధ పరిమళాల సువాసనలతో విరాజిల్లే అయ్యప్పస్వామిని దర్శిస్తారు. స్వామిని దర్శించిన భక్తి పారవశ్యంలో రాయలవారు తన పరివారంతో వచ్చిన బ్రాహ్మణోత్తములను ఈ వృక్షాన్నే అయ్యప్ప స్వామిగా భావించి పూజలు చేస్తూ ఇక్కడే జీవించమని ఆదేశించి వారి జీవనోపాధి పై కొంత మాన్యమును వారికి కేటాయించి, తన పరివారంతో బయలుదేరి వెళ్లారు.

తుమ్మగుంట అగ్రహారం స్థాపన
ఆ తరువాత బ్రాహ్మణోత్తములు తమ భార్య పిల్లలు, బంధువులతో ఈ గ్రామంకు వచ్చి తుమ్మగుంట అనే నామముతో అగ్రహారం ఏర్పాటు చేసుకొని స్వామి వారికి దూప దీప నైవేద్యములు చేస్తూ జీవించుచుండిరి.

చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిచే ప్రతిష్ఠాపన
1920 శ్రీ శ్రీ శ్రీ రామస్వామి సోమయాజులు వారు ఈ గ్రామమున గురువుగా ఉండి శ్రీ గురునాథ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిరి. 1938 వ సంవత్సరంలో శ్రీ కంచి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు తుమ్మగుంట గ్రామానికి విచ్చేసి స్వామి వారి వృక్షమున యంత్ర ప్రతిష్ఠ చేసి స్వామి వారికి విశేష పూజలు జరిపిరి.

అయ్యప్పకు గ్రామోత్సవం
కొంత కాలానికి ఆలయ ధర్మకర్తలు కొండూరు రమణయ్య, కుప్పచ్చి వెంకట శేషయ్య సింహంపై ఉన్న కూర్చుని ఉన్న అయ్యప్పస్వామి చిత్రపటాన్ని మద్రాసు నుంచి తీసుకువచ్చి తుమ్మగుంటలో ప్రతిష్టించి పూజలు జరుపసాగారు. 1947 నుంచి ఈ చిత్రపటాన్ని సింహవాహనంపై ఉంచి గ్రామోత్సవం జరపడం ఆనవాయితీగా మారింది. సాధారణంగా పులిపై ఉన్న అయ్యప్పస్వామినే చూస్తాం కానీ తుమ్మగుంటలో మాత్రం సింహంపై ఉన్న అయ్యప్పస్వామిని చూస్తాం.

ఆలయ విశేషాలు

  • తుమ్మగుంటలో వెలసిన అయ్యప్పస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఒకవైపు విష్ణువు ఆలయం, మరోవైపు శివాలయం ఉండగా శివకేశవుల మధ్యన వెలసిన అయ్యప్ప ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు.
  • 1938 లో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు గ్రామ ప్రదక్షిణ చేసే సమయంలో నిరాదరణకు గురైన అత్యంత అరుదైన ఏకశిలా శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహాన్ని చూసి ఎంతో ఆవేదన చెంది గ్రామస్థులను ప్రోత్సహించి ఆలయ నిర్మాణం గావించి, విగ్రహ ప్రతిష్ఠ చేసారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే వైష్ణవ ఆలయంలో నంది వాహనం ప్రతిష్ఠించి ఉండుట!
  • తొలుత శ్రీ కృష్ణ దేవరాయలు నిద్రించిన ప్రదేశంలో రాయల వారి ఏనుగులు స్నానం చేసిన నీటిగుంట ఏనుగు గుంటగా ప్రసిద్ధి చెంది ఈ నాటికీ సజీవంగా ఉంది.
  • పూజోత్సవాలు
  • తుమ్మగుంట అయ్యప్పస్వామి ఆలయంలో 1947 నుంచి కార్తీకపౌర్ణమికి లక్ష తులసి పూజ విశేషంగా జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామోత్సవం కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి, నెల్లూరు నగరం నుంచి అసంఖ్యాకమైన ప్రజలు పాల్గొంటారు.
  • తుమ్మగుంట అయ్యప్పస్వామి ఆలయంలో 1980 వ సంవత్సరంలో మొదలుపెట్టిన మకరజ్యోతి జ్యోతి దర్శనం ఈ నాటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇక్కడ జ్యోతి దర్శనం ఎంతో ప్రత్యేకం. ఈ రోజున ఇక్కడ విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
  • 1995 లో శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ కల్యాణ వరద అయ్యప్ప స్వామి చిత్రపట ఆవిష్కరణ, శాస్తా కళ్యాణం ప్రారంభమైంది. బహుశా దేశంలోనే సతులతో కూడిన అయ్యప్పస్వామిని ఇక్కడ తప్ప ఇంకెక్కడా దర్శించుకోలేం. అందుకే ఈ క్షేత్రంలో శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ కల్యాణ వరద అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే వివాహం కానివారికి తప్పకుండా వివాహం జరుగుతుందని విశ్వాసం.

వృక్షమే అయ్యప్ప గా భావించి పూజించే తుమ్మగుంట అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాలి. మకర సంక్రాంతి సందర్భంగా తుమ్మగుంట అయ్యప్ప స్వామి శుభాశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణమయ్యప్ప!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details