ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ రాజమహళ్లు- నామమాత్రపు లీజుతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ - YSRCP District Offices Construction - YSRCP DISTRICT OFFICES CONSTRUCTION

YSRCP District Offices Construction Without Permissions: వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు జరిగాయి. అడుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కట్టబెట్టారు. అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు.

ysrcp_district_offices_constructions
ysrcp_district_offices_constructions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 10:08 AM IST

Updated : Jun 23, 2024, 10:47 AM IST

YSRCP District Offices Construction Without Permissions:ఐదేళ్లుగా అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నెంబరు 44లో రూ.2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022, మే 18న 33 సంవత్సరాలు ఎకరా వెయ్యి రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది.

విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల రూపాయల విలువైన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. మహరాజుపేట 540 సర్వే నంబర్​లోని స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవిన్యూ దస్త్రాల్లో డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85 శాతం నిర్మాణం పూర్తైంది. దీనికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

పులివెందులలో వర్రా ప్రత్యక్షం- దర్జాగా జగన్​ క్యాంప్​ ఆఫీస్​లోనే - YSRCP Social Media Activist Varra

పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.2కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చివరిదశకు చేరింది. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. విశాఖ ఎండాడలో 175/4 సర్వే నంబర్​లో రూ.100 కోట్ల విలువైన 2ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు.

అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి 50లక్షల నిధుల కేటాయింపులు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగుభూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

ఇక కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం వెనుక సర్వే నంబరు 107/7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం దాదాపు పూర్తై, రంగులు అద్దుతున్నారు.

2023లో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. ఐతే నిర్మాణానికి ఎలాంంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.10కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. సర్వే నంబర్ 201/3లో సుమారు 72 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దాని విలువ రూ.7కోట్ల పైమాటే. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయ శ్లాబ్‌ పూర్తైంది.

ఏలూరు రైల్వే స్టేషన్​కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థకు చెందిన రూ.5 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహల్​ను తలదన్నేలా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తైంది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. విజయవాడ విద్యాధరపురంలోని సితార సెంటర్‌ సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు.

'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్‌లో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలుండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల అగ్రహారంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఎకరం 50 సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు.

బాపట్లలో ఏపీఐఐసీకి చెందిన రూ.6కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ కనుసన్నల్లో ఇది జరిగింది. 2022 డిసెంబర్ 19న వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇది ఆర్టీసికి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనేజర్​ను అక్కడి నుంచి బదిలీ చేసింది.

పట్టణ ప్రణాళికా విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారేగానీ, ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. ఐనా నిర్మాణం పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ బైపాస్‌లో నీటిపారుదల శాఖ కార్యాలయం ఆనుకొని ఉన్న నాలుగున్నర కోట్ల విలువైన ఎకరం 64 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ కట్టారు. 2023 జులై 31న అనుమతులు తీసుకున్నారు. 2025 జనవరి 21లోగా ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం ప్రారంభానికి గడువుండగానే వైఎస్సార్సీపీ నాయకులు ఆగమేఘాలపై నిర్మాణం పూర్తి చేశారు.

నెల్లూరులో వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీకార్యాలయం నిర్మాణం చేపట్టారు. అనుమతుల్లేకుండానే 90శాతం నిర్మాణం పూర్తి చేశారు. దీనికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని సర్వే నంబర్ 95-2లో ఏపీ ఆగ్రోస్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన ఎకరం 60 సెంట్ల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తైంది.

నంద్యాల సమీపంలోని కుందూనది ఒడ్డున జగనన్న కాలనీలో సుమారు 7 కోట్ల విలువైన ఎకరా భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించారు. 6 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. వీటికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కడపలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సర్వేనంబర్ 424/3 లోని రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12కోట్ల విలువైన ఎకరం 61 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది. అనంతపురంలో రూ.45 కోట్ల విలువైన ఎకరం 50 సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి అధికారులు నోటీసిచ్చారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో 20కోట్ల విలువైన ఎకరంన్నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది తుదిమెరుగుల దశలో ఉంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన రూ.14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి రెవెన్యూశాఖతో పాటు తుడా అనుమతులూ లేవు. పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్‌లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు.

చిత్తూరు జిల్లాలో రూ.17కోట్ల విలువైన 2 ఎకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు. ఇది ఇతరుల ఆధీనంలోని భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.677 కోట్ల విలువైన 42 ఎకరాల 24 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రాజ ప్రాసాదాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు. ఒక్క ఒంగోలు కార్యాలయం మినహా మరేదానికీ అనుమతులు తీసుకోలేదు. కానీ నిర్మాణాలు పూర్తికావచ్చాయి. అధికారం అండతో వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినవి ఏమన్నా ఉన్నాయంటే అవి సొంత పార్టీకి చెందిన కార్యాలయాలేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

'అవినీతి ఆరోపణలు, అక్రమాలకు వత్తాసు'- భారీగా ఐఏఎస్​ల బదిలీ, 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు - IAS Transfers in ap

Last Updated : Jun 23, 2024, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details