YSRCP Defeat in Assembly Elections in AP :పాలకులు ప్రజా సేవకులే తప్ప యజమానులు కాదు! ఆ వాస్తవాన్ని విస్మరించి పాపిష్టి ఫాసిస్టులా మారిన జగన్ పీడను జనం వదిలించుకున్నారు! అలవిమాలిన అహంకారం, లెక్కాపత్రంలేని స్వాహాపర్వాలతో రాష్ట్రానికి వినాశకారిగా పరిణమించిన జగన్మోహన్‌రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల విజ్ఞతకు జేజేలు! ఒక నియంత బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ఆంధ్రావని చైతన్యశీలతకు వేనవేల వందనాలు! ఇది ఐదుకోట్ల ఆంధ్రుల సమష్టి విజయం! జనం తిరగబడి, ప్రభంజనమై విరుచుకుపడి, జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం.
స్వర్ణాంధ్రను శిథిలం చేసి, అన్ని వర్గాలనూ వెంటాడి వేధించిన జగన్ వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం! వైఎస్సార్సీపీ భ్రష్టపాలనపై మూడోకన్ను తెరిచిన జనసామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతను 164 సీట్ల అఖండ మెజార్టీతో కూటమి నేతల చేతుల్లో పెట్టింది. 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తాను' అంటూ ఊదరగొట్టి 2019 ఎన్నికల్లో గద్దెనెక్కిన జగన్ కనీసం రోడ్లు కూడా వేయలేదు.
'గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా ఏపీ : పరిశ్రమలను తీసుకురాలేదు. యువతకు ఉపాధి చూపించలేదు! రైతులకు సాగునీరు ఇవ్వలేదు. దళిత, గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు! ఇవేమీ చేయని జగన్ విషపూరితమైన 'జె' బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టనపెట్టుకున్నారు. ఏపీని 'గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. వైఎస్సార్సీపీ ప్రబుద్ధులంతా కలిసి ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడీ, మద్యం దందాలూ భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు.
ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లలోకి లాక్కుపోయిన వైఎస్సార్సీపీ సర్కారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది. రాక్షసత్వంలో జగన్‌కు సరిజోడులై, తోడుదొంగలై ఏపీని పీల్చిపిప్పి చేసిన వైఎస్సార్సపీ అసురులపై ఆంధ్ర ప్రజానీకం కసితీరా వేటేసింది. జగన్ సర్కార్ పాతకాల కారణంగా ఏపీలో కొడిగట్టుకుపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు తీయించడం కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాము కానుంది. రాష్ట్ర రుణభారాన్ని దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలకు చేర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీని దివాలా అంచులకు ఈడ్చుకుపోయింది.
అభివృద్ధి సంక్షేమాలను జోడెడ్లుగా నడిపించడం కూటమి సర్కారుకు సవాలే! :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే 25 వేల కోట్ల రూపాయల వరకు అప్పుల ముష్టెత్తిన సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టింది. దాన్ని గాడినపెట్టడం, రాష్ట్రాదాయాన్ని పెంచుతూ అభివృద్ధి సంక్షేమాలను జోడెడ్లుగా నడిపించడం కూటమి సర్కారుకు పెద్దసవాలే! పన్నుల భారం పెంచకుండా సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, జనం జేబులకు చిల్లి పెట్టేందుకు జగన్ వేసిన చెత్తపన్నులు తొలగించడమూ అంతే ప్రధానం.