తెలంగాణ

telangana

ETV Bharat / politics

వివేకా హత్య వెనకుంది అతడే - ప్రజా తీర్పు కోసమే సాక్ష్యాలు చూపిస్తున్నా : సునీత - sunitha on VIVEKA MURDER CASE - SUNITHA ON VIVEKA MURDER CASE

YS Sunitha About Viveka Murder Case : న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్​తో నిందితులకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయనేందుకు కాల్ డేటానే నిదర్శనమన్నారు. హత్య జరిగిన సమయంలో అవినాష్ - ఎర్ర గంగిరెడ్డి మధ్య కాల్ సంభాషణ జరిగిందని, తెల్లవారుజామున జరిగిన కాల్ డేటా వివరాలు సీబీఐ ఇవ్వలేదన్నారు. ముమ్మాటికీ వివేకాను హత్య చేయించింది అవినాష్ అని, సాక్ష్యాధారాలున్నాయంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్​లో సంచలన విషయాలు వెల్లడించారు. పైస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని, సీబీఐ చేయాల్సింది ఇంకా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

YS Sunitha About Viveka Murder Case
YS Sunitha About Viveka Murder Case

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 3:42 PM IST

వివేకా హత్య వెనకుంది అతడే - ప్రజా తీర్పు కోసమే సాక్ష్యాలు చూపిస్తున్నా : సునీత

YS Sunitha About Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీత అన్నారు. సీబీఐపై ఒత్తిడి ఉందన్న ఆమె, న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలను వైఎస్ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండె పోటు అని ఎవరైనా అనుకుంటారా అని సునీత ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్‌ డేటాతో పాటు గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్‌ డేటాను సునీత వెల్లడించారు.

మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి నిందితుల పేర్లు చెప్పిందన్న సునీత, ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్‌, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ4 దస్తగిరి అని తెలిపారు. ఏ1 ఎర్ర గంగిరెడ్డితో అవినాష్‌కు పరిచయం ఉందని, సునీల్‌ యాదవ్‌కు తమ్ముడు ఉన్నాడని అతడి పేరు కిరణ్‌ యాదవ్‌ అని అన్నారు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డితో కిరణ్‌ యాదవ్‌ ఉన్న ఫొటోలు చూపించిన సునీత, ఏ3 ఉమాశంకర్‌రెడ్డితోనూ అవినాష్‌కు పరిచయం ఉందని అన్నారు. ఉమాశంకర్‌ రెడ్డికి అవినాష్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ వివరాలను సైతం సునీత చూపించారు. ఎం.వి.కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడన్న సునీత, శివ శంకర్‌ రెడ్డికి, ఎం.వి.కృష్ణారెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ మార్చి 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ ఉదయం వరకు స్విచ్ఛాఫ్​లో ఉందని అన్నారు.

హత్య జరుగుతున్న సమయంలో అవినాష్ - ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయని సునీత అన్నారు. హత్యకు ముందు రోజు మార్చి 14వ తేదీన సునీల్ యాదవ్ గూగుల్ టేక్ ఔట్ చేసిన వివరాల ప్రకారం అవినాష్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నట్టు చూపించిందని, 15వ తేదీన హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డి ఇంటి వద్దే ఉన్నట్టు చూపించిందని తెలిపారు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్​ల మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని, ఐపీడీఆర్ డేటా ప్రకారం అర్ధరాత్రి 1.37 నిమిషాలకు గంగిరెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని తెలిపారు. అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య నాలుగు కాల్స్ ఉన్నాయని, ఈ మధ్య సమయంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హత్య జరిగిన తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య చాలాసార్లు కాల్స్ చేశాడని, ఆ కాల్స్ ఎవరికి వెళ్లాయని ప్రశ్నించారు.

అవినాష్‌ను అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా?: సునీత - YS Vivekananda Reddy Murder case

భావోద్వేగానికి గురైన సునీత: అవినాష్‌ మాత్రం వీళ్లెవరో తెలియదని చెబుతున్నారన్న సునీత, ఫొటోలు, ఫోన్‌ డేటా చూస్తే అవినాష్‌తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోందని విమర్శించారు. వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్‌రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలను కూడా సునీత చూపించారు. హత్య జరిగినరోజు రాత్రి ఫోన్‌ కాల్‌ డేటా వివరాలు బయటపెట్టారు. ఫోన్‌ కాల్‌డేటా, గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్‌ డాటా వివరాలను వెల్లడించారు. హత్య రోజు రాత్రి నుంచి ఉదయం వరకు ఏం జరిగిందో పూర్తిగా వివరించారు. హత్య రోజు సాక్షిలో వార్తలు, నేతల వ్యాఖ్యలను ప్రదర్శించారు. వివేకా హత్య వివరాలు వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

ఎవరైనా గుండెపోటు అనుకుంటారా: ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటం అని, ఇవాళ రాష్ట్రమంతా తన పోరాటానికి మద్దతిస్తున్నారని తెలిపారు. తనకు మద్దతిస్తున్న ఏపీ, తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు తెలిసిన విషయాలు ప్రజల ముందు ఉంచానన్న సునీత, ఇది న్యాయమా అని అడుగుతున్నానన్నారు. హత్య జరుగుతున్న సమయంలో అవినాష్‌, గంగిరెడ్డికి మధ్య ఫోన్‌కాల్స్‌ ఉన్నాయని, తాను చూపిన దృశ్యాలు చూస్తే ఎవరైనా గుండెపోటు అనుకుంటారా అని ప్రశ్నించారు.

ఇన్ని సాక్ష్యాలున్నా న్యాయం జరగలేదన్న సునీత, ప్రజలకు నిజం తెలవడానికే దృశ్యాలు ప్రదర్శిస్తున్నానని అన్నారు. ప్రజా తీర్పు కోసమే ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. ప్రజా తీర్పు కోరి సాక్ష్యాలు చూపకపోతే వాళ్లెలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఆడపిల్లలు ఇలా బయటకొచ్చి మాట్లాడుతున్నారంటున్నారని, షర్మిలపైనా విమర్శలు చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. గతంలో షర్మిల 3200 కి.మీ. పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు ఏమీ అనలేదని నిలదీశారు. ఇప్పుడు షర్మిల బయటకొస్తే విమర్శలు చేస్తున్నారని, తాను టీడీపీలో చేరానని విమర్శిస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవుల కోసం తమ్ముణ్ని చంపితే వైఎస్సార్ తట్టుకునేవారా?: సునీత - YS Sunitha in Election Campaign

న్యాయం కోసం ఎవరితోనైనా మాట్లాడతా: న్యాయం కోసం ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధమన్న సునీత, జగన్‌తోనైనా మాట్లాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. గతంలో జగన్‌తో కొన్నిసార్లు మాట్లాడానని, తర్వాత తనకు జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ కోసం నేను జగన్‌కు లేఖలు కూడా రాశానని గుర్తు చేశారు. వివేకా హత్యపై సీబీఐ సాక్ష్యాలు ఇచ్చిందని తెలిపారు. చనిపోయింది విమలమ్మ అన్న అని, అయినా సరే, అన్నపై ఆమె చూపిన ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. విమలమ్మ చెబుతున్న విషయాలపై స్పష్టత లేదన్న సునీత, ఆడపిల్లలు బయటకొస్తారా అని అడుగుతున్నారని, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఈ విషయం తెలియదా అని నిలదీశారు.

అవినాష్‌ అసూయపడ్డారు: ఆధారాల ప్రకారం అవినాష్‌పై అనుమానం ఎవరికైనా కలుగుతుందని, షర్మిలకు వివేకా మద్దతిచ్చారని గుర్తు చేశారు. వివేకా బలమైన నాయకుడన్న సునీత, వివేకా స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్‌ అసూయపడ్డారని తెలిపారు. వివేకాతో తనకు కొన్ని విషయాల్లో విబేధాలున్నాయని, విబేధాలున్నంత మాత్రాన నాన్నపై ప్రేమ తగ్గుతుందా అని ప్రశ్నించారు. కొన్ని విబేధాలున్నా మేం ఒకే ఇంట్లో ఉన్నామని పేర్కొన్నారు. మా నాన్నకు కుమార్తయినా, కుమారుడైనా తానేనని సునీత అన్నారు. రాజశేఖర్‌రెడ్డిని, వివేకాను కడప ప్రజలు వాళ్ల ఇంట్లో మనిషి అనుకుంటారని, వాళ్ల ఇంట్లో మనిషికి ఇలా జరిగితే ఎవరూ క్షమించరని సునీత తెలిపారు. ప్రజా తీర్పు కోరుతున్నాన్న సునీత, కడప ప్రజలు షర్మిలకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అవినాష్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా అండగా నిలుస్తున్నారు : పీసీసీ అధ్యక్షురాలు షర్మిల - Sharmila Election Campaign

ABOUT THE AUTHOR

...view details