Nalgonda Lok Sabha Young Voters : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఓటర్ల వాటా సుమారు 40 శాతంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో యువత పాత్ర కీలకం కానుంది. వీరి మద్దతు కూడగట్టేందుకు అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. వారి పరిధిలో కొత్తగా నమోదైన ఓటర్లు, 30ఏళ్ల వయసు వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం యువత తమకే మద్దతుగా ఉందని ఎవరికి వారే అనుకుంటున్నారు.
Nalgonda Youth Talk on Lok Sabha Elections :యువత మాత్రం తమ ఓటును వృధాగా పోనివ్వమని ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని అంటున్నారు. సమాజాభివృద్ధికి తోడ్పాటందించే మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేస్తామని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో అధిక శాతం యువత చదువు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వీరి చిరునామాల సేకరణ ప్రక్రియను ప్రారంభించాయి.
"ఎవరైతే యువతకు ప్రాముఖ్యత ఇచ్చి ఉద్యోగాలు, అవసరమైన విద్యను అందజేస్తారో అలాంటి సరైన నాయకుడిని ఎన్నుకుంటాం. మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. దాంతో ఎవరైతే సరిగా పని చేస్తారో, పరిపాలిస్తామని అనుకుంటున్నామో వారికే ఓటు వేస్తాం. రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఇచ్చే తాయిలాలు చూసి ఓటు వేయం." - విద్యార్థులు, నల్గొండ