'సీఎం జగన్ తన సామాజిక వర్గానికి పదవులు కేటాయించి, బీసీలను మోసం చేశారు' YCP workers meeting against MLA Prakash Reddy:రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని నమ్మి గెలిపిస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని వైసీపీ అసమ్మతి వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని యాదవ కళ్యాణమండపంలో వైసీపీ రాప్తాడు నియోజకవర్గం అసమ్మతి నాయకులు సమావేశం నిర్వహించి మాట్లాడారు.
వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం: వైసీపీ ముఖ్యమంత్రి జగన్ తన సామాజిక వర్గానికి పదవులు కేటాయించి బీసీలను మోసం చేశారని రాప్తాడు అసమ్మతి నేతలు ఆరోపించారు. 2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక తన నిజస్వరూపాన్ని చూపారని మండిపడ్డారు. బీసీలకు మొండి చేయి చూపిన వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కుటుంబం వెంట ఉన్న బీసీ సామాజిక వర్గం ఏ ఒక్కరూ బాగుపడిన చరిత్ర లేదన్నారు. వీరి కుటుంబం కోసం పనిచేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇవాళ నియోజకవర్గంలో అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ఏ ఒక్క బీసీ నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.
సొంత కార్యకర్తలకు సైతం అన్యాయం: నియోజకవర్గంలో పదవులు సైతం రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారన్నారు. ఆ వర్గంలోను కూడా పార్టీ కోసం పనిచేసిన వారికి దక్కలేదన్నారు. నియోజకవర్గంలో తోపుదుర్తి కుటుంబ సభ్యులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి సొంత కార్యకర్తలకు సైతం అన్యాయం చేశారని ఆరోపించారు. వైసీపీకి రాజీనామా చేసి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. బీసీలకు సంబంధించిన అభ్యర్థిని కానీ, లేదా తమకు మద్దతు ఇచ్చే పార్టీ తెలుపునకు పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
నా మీద నాకే అసంతృప్తి ఉంది - రాప్తాడుకు ఎంతో చేయాలనుకున్నా : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్
వైసీపీ పతనం ఖాయం: నా బీసీలు, నాఎస్సీలు, నా ఎస్టీలు అనే జగన్ రాయలసీమలోని బీసీలకు అన్యాయం చేశారని తెలిపారు. మెుత్తం రాయలసీమలో ఉన్న 85 శాతం బీసీలు ఉంటే, కేవలం ఏడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. అనంతపురంలో 12 మంది అభ్యర్థులు ఉంటే 11 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. రాప్తాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఎవ్వరికైనా టికెట్ ఇస్తే అంతా కలిసి గెలిపించుకుంటామని తెలిపారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయమని హెచ్చరించారు.
తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు- బీసీలపై కక్షగట్టిన జగన్ సర్కారు: పరిటాల సునీత