Woman Contesting in Telangana Lok Sabha Elections 2024 :జనాభాలో సగం మహిళలే. ఓటర్ల సంఖ్యలోనూ అంతే. కానీ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీల నుంచి 51 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, వీరిలో టికెట్లు పొందిన నారీమణులు ఆరుగురు ఉన్నారు. అంటే సుమారు 12 శాతమే.
Lok Sabha Elections 2024 : ఈ ఆరుగురిలో హస్తం పార్టీ ముగ్గురు మహిళలకు టికెట్లు ఇవ్వగా, బీజేపీ ఇద్దరికి, బీఆర్ఎస్ ఒకరికి అవకాశం కల్పించాయి. కాంగ్రెస్ నుంచి వరంగల్‌లో కడియం కావ్య, మల్కాజిగిరిలో పట్నం సునీత మహేందర్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ ఉన్నారు. బీజేపీ తరఫున మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, హైదరాబాద్‌లో కొంపెల్ల మాధవీలత ఉండగా బీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్‌లో మాలోత్ కవిత లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు ఆయా స్థానాల్లో ఇతర ప్రధాన పార్టీల నుంచి పురుషులు పోటీ చేస్తున్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో తెలంగాణ నుంచి ఒక్కో మహిళ మాత్రమే ఎంపీగా విజయం సాధించారు. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ గడప తొక్కింది ఇద్దరే. 2014లో నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత (బీఆర్ఎస్) గెలుపొందారు. 2019లో అదే స్థానం నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక మహిళా ఎంపీ మాలోత్ కవిత. మహబూబాబాద్ నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె అదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు.