VIJAYAMMA SUPPORT SHARMILA : వైఎస్సార్సీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల... వీరిద్దరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు? వైఎస్ మరణాంతరం ఇద్దరూ ఒకేసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్తో విభేదించి జగన్ కొత్త పార్టీ పెట్టినా ఎన్నికల ప్రచారంలో షర్మిల పాత్ర అంతా ఇంతా కాదు. అన్నాచెల్లెళ్లిద్దరూ తమదైన శైలిలో ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. 'జగనన్న విడిచిన బాణాన్ని' అంటూ షర్మిల చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తే. అదే విధంగా 'నా అక్క చెల్లెమ్మలు' అంటూ ప్రసంగించే జగన్కు వ్యతిరేకంగా స్వయంగా ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత మాట్లాడడం తాజా రాజకీయాల్లో పెను చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు అనే అంశంలో స్వయంగా ఆయన సతీమణి విజయమ్మ స్పష్టత నిచ్చారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరిని గెలిపించాలో కూడా చెప్తూ వారసురాలిని తేల్చేశారు.
ఓ వైపు కుమారుడు, మరో వైపు కుమార్తె. అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరు, పరస్పర విమర్శల జోలికి వెళ్లకుండా విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా అమెరికాలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తాజాగా ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వైఎస్ ముద్దు బిడ్డ ఎవరో, వైఎస్ అభిమానులు ఎవరికి ఓటు వేసి గెలిపించాలో తేల్చిచెప్పారు. కడప ఓటర్లు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరడం రాజకీయ వారసత్వాన్ని ప్రకటించినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ విజయమ్మ ఏమన్నారంటే!