CM Chandrababu Kuppam Tour: ప్రజలను పేదిరికం నుంచి బయటపడేసే పీ4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్శిటీ ఆడిటోరియంలో 'స్వర్ణ కుప్పం విజన్- 2029' డాక్యుమెంట్ ఆవిష్కరించారు. జూన్‌లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్‌డ్యామ్ నిర్మిస్తామని వెల్లడించారు. కుప్పంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇవాళ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
హైదరాబాద్‌లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైఎస్సార్సీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని పేర్కొన్నారు.
ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ సర్వే పూర్తి - మారనున్న ఆ ఏడు ప్రాంతాల రూపురేఖలు
కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తాం: ఏటా ఏ అభివృద్ధి పనులు చేయాలో ప్రణాళికలు రచించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తామని, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని, టీడీపీ పుట్టినప్పుటి నుంచి కుప్పంలో మరో జెండా ఎగరలేదని గుర్తు చేశారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జూన్‌లోపు హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెస్తామని స్పష్టంచేశారు. పాలారు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నం చేస్తామని, వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భజలాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికంగా పడిన వర్షాలను సద్వినియోగం చేశామన్న సీఎం, 73 శాతం జలాశయాల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సౌర విద్యుదుత్పత్తి కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, కరెంట్ బిల్లులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని, సాంకేతికత అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భూ సమస్యలన్నీ పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు