CM Chandrababu Launched Solar Pilot Project in Kuppam: మన ఇళ్లపై మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సౌర, పవన విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. తమ చిన్నప్పుడు కరెంట్ ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. సౌర, పవన విద్యుత్ వల్ల ప్రజలకు భారం తగ్గుతుందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్య ఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
కరెంట్ బిల్లు కట్టే భారం ఉండదు: ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. 60 యూనిట్లు వాడుకోవచ్చని, 140 యూనిట్లు గ్రిడ్‌కు ఇవ్వవచ్చని అన్నారు. ఏడాదికి రూ.4 వేల విలువైన కరెంట్ ఉచితంగా వాడుకోవచ్చన్న సీఎం, మీకు అదనంగా ఏడాదికి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరెంట్ బిల్లు కట్టే భారం ఉండదని సీఎం చంద్రబాబు చెప్పారు. కుప్పంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మోడల్ నియోజకవర్గంగా కుప్పం: మనం ఇప్పుడు కాలుష్య కోరల్లో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎరువులు, పురుగుమందులు వేసిన ఆహారం మనం తింటున్నామని, ఇళ్లు, పరిసరాల్లో చెత్తాచెదారం పోగేసుకుంటున్నామని తెలిపారు. చెత్తాచెదారం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, జీరో ఎమిషన్ అంటున్న ఐఐటీ కాన్పూర్ బృందాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఆటోలు, బైకులను ఇంటివద్దే ఛార్జింగ్ చేసుకోవచ్చని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ సైకిళ్లు బాగా పెరగాలని సూచించారు. కుప్పంను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న బృందానికి అభినందనలు తెలియజేశారు.
జూన్‌లోగా కుప్పంకు సాగునీరు: ఎక్కడికక్కడ చెట్లు పెంచాలని, నీరు నిల్వ చేసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే జూన్‌లోగా హంద్రీనీవా పూర్తి చేసి కుప్పంకు సాగునీరు తెస్తామని వెల్లడించారు. గతంలో జన్మభూమి, శ్రమదానం కుప్పం నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. పేదవాళ్లను ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానన్న సీఎం, ప్రకృతి సాగును బాగా ప్రోత్సహిస్తామని తెలిపారు. సహజ పద్ధతుల్లో పండిన ఉత్పత్తులకు అధిక ధర కూడా వస్తుందని అన్నారు. వర్షపునీటిని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాటర్ రీసైక్లింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని, చెత్త నుంచి ఎరువులు, కరెంట్ తయారుచేసుకోవచ్చని తెలిపారు.
స్వర్ణ కుప్పం- విజన్ 2029! డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు