MINISTER NARA LOKESH COMMENTS: విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్, రైల్వే జోన్ భవనాల స్థాపన, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనతో పాటు 41 అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమవుతాయని మంత్రి లోకేశ్ తెలిపారు. అదే విధంగా విశాఖలో ప్రధాని ఒక రోడ్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విశాఖ కలెక్టరేట్‌లో ప్రధాని పర్యటన మీద సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఎన్నికల ముందు చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారని, అనంతరం విజయవాడలో ఒక రోడ్ షో చేశారని గుర్తు చేశారు. చిలకలూరిపేట, విజయవాడ కార్యక్రమాల కంటే విశాఖపట్నంలో ప్రధాని పర్యటన మరింత విజయవంతం కావాలని అన్నారు.
ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమి లేదు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మరో 2 నెలల్లో విశాఖలో టీసీఎస్: ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం నడుస్తోందని లోకేశ్ తెలిపారు. అయితే కేంద్ర సహకారం వల్ల రాష్ట్రం ముందుకు పోతోందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం ప్రత్యేక సహకారాన్ని అందిస్తోందని అన్నారు. మరో 2 నెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని లోకేశ్ స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు: గత అయిదేళ్లలో పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులు గురి చేశారని మండిపడ్డారు. ఇప్పటికీ ఆ భయంతో చాలామంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు చూడటానికి భయపడుతున్నారని చెప్పారు. వారికి భరోసా ఇచ్చి రాష్ట్రానికి పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం వేగంగా పూర్తి అవుతుందన్నారు. వాల్తేరు రైల్వే డివిజన్ అనేది రెండు రాష్ట్రాల మధ్య అంశమని, దీనిపై సమగ్ర చర్చను రెండు రాష్ట్రాలు చూసుకుంటాయని తెలిపారు.
ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అత్యధికంగా పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. విశాఖ ఒక గొప్ప ఐటీ నగరంగా అవుతుందని, అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ ఈక్విప్మెంట్, మెడ్‌టెక్ జోన్లు అభివృద్ధి అవుతున్నాయని అన్నారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌లో నారా లోకేశ్ ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
"వైఎస్సార్సీపీ ఫేక్ పార్టీ. గత అయిదేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారు. ఒక్క రుషికొండ ప్యాలెస్ తప్ప, ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదు. వచ్చిన కంపెనీలను సైతం తరిమేశారు. కంపెనీలు మూతపడేలా చేశారు. రైల్వే జోన్ పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో చాలా విధ్వంసం చేశారు. కంపెనీలు రావడానికి భయపడుతున్నాయి. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వరు అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నారు. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టమంటున్నారు". - నారా లోకేశ్, మంత్రి