Janasena Party Recognized by ECI: జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు లేఖ పంపించింది.
సార్వత్రిక ఎన్నికల్లో 100శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్‌సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది.
జనసేన ఆవిర్బావం: జనసేన పార్టీని పవన్ కల్యాణ్ 2014లో స్థాపించారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో జనసేన నేరుగా పోటీ చేయకుండా ఇతర పార్టీలకు మద్దతిచ్చింది. 2019 ఎన్నికలలో పోటీ చేసిన జనసేన ఒక సీటు గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డ్ సాధించింది.