Vasireddy Padma Quit YSRCP : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొందరు రాజీనామాల బాట పట్టగా, మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలువురు మేయర్లు, కౌన్సిలర్లు గుడ్ బై చెప్పేశారు. తాజాగా వైఎస్సార్సీపీకి మహిళ కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖను వైఎస్ జగన్‌కు పంపారు.
వైఎస్సార్సీపీని నడిపించడంతో పాటు పరిపాలనలోనూ వైఎస్ జగన్‌కి బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని చెప్పారు. అందుకు ఈ ఎన్నికల తీర్పే నిదర్శనమని తెలిపారు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇప్పుడు గుడ్ బుక్ పేరుతో ఆయన మరోసారి మోసం చెేసేందుకు సిద్ధపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.