ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'ఏపీ ఇసుక ఫైల్స్' తవ్విన కొద్దీ అక్రమాలు - ఆ ఒక్క సంతకంతో రూ.800 కోట్లు - AP Sand Files - AP SAND FILES

AP SAND mining scam : జగన్‌ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో తవ్వినకొద్దీ అక్రమాలు, ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా కాంట్రాక్టర్​ ఎలాంటి బకాయి లేరంటూ గనుల శాఖ సంచాలకుడు నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం.

sand_mining
sand_mining (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 9:11 AM IST

AP Sand Mining Scam : జగన్‌ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని ముఖ్య నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా, అధికారులు సైతం వంతపాడారు. కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా అదేమీ లేదంటూ గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. కాగా, సర్టిఫికెట్‌కు సంబంధించి దస్త్రంలో ఎక్కడా నోట్‌ఫైల్‌ లేకపోవడం కొసమెరుపు. ఈ విషయం తెలిసిన అధికారులు షాక్‌ తిన్నారు.

గనుల శాఖ పూర్వపు సంచాలకుడు వెంకటరెడ్డి మొన్నటివరకు ఇలా చేసిన మోసాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దల దోపిడీకి ఎలా సహకరించారనే నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ఏం జరిగిందనేది వారం రోజులుగా అధికారులు అధ్యయనం చేశారు. ఇసుక టెండర్లు, తవ్వకాలు, విక్రయాలు, లావాదేవీల అంశాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఈ వివరాలు చూసి అధికారులు విస్తుపోతున్నారు.

జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ (జేపీ) 2021 మే నుంచి 2023 నవంబరు వరకు రాష్ట్రంలో ప్రధాన ఇసుక గుత్తేదారుగా ఉంది. ఉపగుత్తేదారుగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవహరించగా ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. ముందుగా రెండేళ్లకు రూ.1,528 కోట్లు చెల్లించేలా జేపీ సంస్థ టెండరు దక్కించుకోగా, తర్వాత మరో ఆరు నెలలు కొనసాగడంతో మరో రూ.320 కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.1,850 కోట్లు ప్రభుత్వానికి జేపీ సంస్థ చెల్లించాలి. కానీ, రూ.1,059 కోట్లే చెల్లించిన ఆ సంస్థ ఇంకా దాదాపు రూ.800 కోట్ల బకాయి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇదిలా ఉండగా వాస్తవాలన్నీ దాచిపెట్టి జేపీ సంస్థ బాకీ లేదంటూ మార్చి 14న గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి నో డ్యూ సర్టిఫికెట్‌ జారీ చేశారు. పైగా సబ్​ కాంట్రాక్టు పొందిన టర్న్‌కీ సంస్థ బ్యాంక్‌ గ్యారంటీగా చూపిన రూ.120 కోట్లు విడుదల చేయాలంటూ మార్చి 23న బ్యాంక్‌ మేనేజర్‌కు వెంకటరెడ్డి లేఖ రాయడం గమనార్హం. దీంతో ఆ బ్యాంక్‌ గ్యారంటీ రూ.120 కోట్లు విడుదల చేశారు.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశం - SC Angry on Sand Mining in AP

కాంట్రాక్టు సంస్థ బకాయి మొత్తం చెల్లిస్తే దాని వివరాలన్నీ నమోదు చేసి నో డ్యూ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్లు పైల్​ ఉండాలి. కానీ, ఇసుక తవ్వకాల ఫైల్​లో అలాంటి నోట్‌ఫైల్‌ లేదు. కిందిస్థాయి అధికారుల సంతకాలు కూడా లేకుండానే వెంకటరెడ్డి నేరుగా నో డ్యూ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత నోట్‌ఫైల్‌ కాపీని ఆ దస్త్రంలో జత చేయాలంటూ కిందిస్థాయి అధికారులకు ఇచ్చే ప్రయత్నం చేయగా, లొసుగులను గుర్తించిన సిబ్బంది సంతకాలు చేయలేదని, నోట్‌ఫైల్‌లో చేర్చలేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో గతేడాది డిసెంబరు నుంచి రెండు ప్యాకేజీల్లో ప్రతిమా ఇన్‌ఫ్రా, ఓ ప్యాకేజీలో జీసీకేసీ సంస్థ ఇసుక టెండరు దక్కించుకున్నాయి.

ప్రతి 15 రోజులకు అడ్వాన్స్‌గా ఇసుక సొమ్ము చెల్లించాకే విక్రయాలు చేయాలి. కానీ ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటికి రూ.220 కోట్ల వరకు గనులశాఖకు బాకీ పడినా వెంకటరెడ్డి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో జేపీ, ప్రస్తుతం జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా పేరిట జరిగిన ఇసుక దోపిడీ వివరాలను గనులశాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. ఎలా అడ్డగోలుగా దోచేశారు? నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? టెండరు నిబంధనలు ఎలా పాటించలేదు తదితర వివరాలన్నీ అందించనున్నారు. భారీ ఎత్తున అక్రమాలు జరిగిన నేపథ్యంలో వీటిపై సిట్‌ వేయాలా? సీఐడీ విచారణకు ఆదేశించాలా? విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయించాలా? అనేది సీఎం నిర్ణయిస్తారని గనులశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇసుక టెండర్లలో గోల్​మాల్ - జగన్‌ మార్క్‌ అడ్డాగా దోపిడీ - YSRCP Irregularities Sand Tenders

ఇసుక టెండర్లు దక్కించుకున్న జేపీ సంస్థ గనులశాఖకు రూ.1,059 కోట్లు చెల్లించినట్లు రికార్డుల్లో ఉన్నా అందులో ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో జేపీ సంస్థ చెల్లించినది రూ.259 కోట్లేనని అధికారులు గుర్తించారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి జేపీ సంస్థ భారీగా ఇసుక తరలించినట్లు లెక్కలు చూపించడంతో గృహనిర్మాణ సంస్థ రూ.500 కోట్లు గనులశాఖకు చెల్లించింది. అలాగే నాడు-నేడు పనులకు ఇసుక సరఫరా చేశామంటూ జేపీ సంస్థ లెక్కలు చూపడంతో వైద్యశాఖ, విద్యాశాఖలు దాదాపు రూ.300 కోట్లు గనులశాఖకు చెల్లించాయి. అంటే జేపీ సంస్థ బదులు గృహనిర్మాణ సంస్థ, వైద్య, విద్యాశాఖలు కలిపి రూ.800 కోట్లు గనులశాఖకు రీయింబర్స్‌ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వైఎస్సార్సీపీ నేతలు నిత్యం లక్షల టన్నుల ఇసుక తరలించి వేల కోట్లు ఆర్జించగా ప్రభుత్వానికి జేపీ సంస్థ తరఫున రూ.250 కోట్లే చెల్లించారనేది స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో ఇసుక దొంగలపై జగన్​ సర్కారు సమాధానమెంటీ

ABOUT THE AUTHOR

...view details