Tension in ministers : రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఈ జిల్లా నుంచి రాజకీయాల్లో రాణించిన వారూ ఎక్కువే. అయితే గత కొన్నేళ్లగా ఈ జిల్లాను వెంటాడుతున్న సెంటిమెంట్ మాత్రం అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినా, తదుపరి ఎన్నికల్లో వారు ఓటమి చెందటం, లేదా పోటీకి దూరంగా ఉండటం, లేదా రాజకీయ జీవితానికి ముగింపు పలకటం వంటి పరిణామాలే చోటుచేసుకుంటూ వస్తున్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసే వారు తమ పార్టీ అధికారంలోకి వస్తే చాలు కానీ మంత్రి పదవి జోలికి మాత్రం పోవద్దనుకుంటున్నారు. గత ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసులు మంత్రులుగా పని చేశారు. వీరిలో పేర్ని నాని ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుని తన కొడుకుని ఈ సారి మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక జోగి రమేష్, వెలంపల్లి గతసారి పోటీ చేసిన స్థానాల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పార్టీ అధిష్ఠానం వారి సీట్లను మార్చేసింది. గతసారి పెడన నుంచి ప్రాతినిధ్యం వహించిన జోగి రమేష్ ఈసారి పెనమలూరుకు మారగా, విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసిన వెలంపల్లి ఈసారి సెంట్రల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రులుగా వీరిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొడాలి నాని మాత్రం గుడివాడ నుంచే మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు.
గతంలో మంత్రులుగా పని చేసిన వారి పరిస్థితి పరిశీలిస్తే, ఈ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారికి గడ్డుకాలమేనన్నది స్పష్టమవుతోంది. 2014సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ ఉమ్మడి కృష్ణ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేశారు. 2019సార్వత్రిక ఎన్నికల్లో వీరు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయారు. దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర గత ఎన్నికల్లో ఓటమి చెందగా, కామినేని శ్రీనివాస్ పోటీ చేయలేదు. ఇక 2009 సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే, కొలుసు పార్థసారధి మంత్రిగా పనిచేశారు. ఈయన కూడా తర్వాత జరిగిన 2014సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2004సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మండలి బుద్ధ ప్రసాద్ , కోనేరు రంగారావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు మంత్రులుగా ఈ జిల్లా నుంచి పనిచేసిన వారే. తర్వాతి చట్టసభలో వీరెవ్వరికీ చోటు దక్కలేదు. 1999లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నడికుదిటి నరసింహారావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు 2004ఎన్నికల్లో ఓటమి చెందారు. 1995 లో మంత్రులుగా పనిచేసిన నెట్టెం రఘురామ్, సింహాద్రి సత్యనారాయణ, దేవినేని వెంకట రమణ కూడా 99చట్టసభల్లో అడుగుపెట్టలేకపోయారు. 1994 సార్వత్రిక ఎన్నికల్లో మంత్రిగా పనిచేసిన దేవినేని నెహ్రూ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేకపోయారు. 1989 ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన కటారి ఈశ్వర్ కుమార్, ఎంకే బేగ్, కోనేరు రంగారావు, 1985 ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన వసంత నాగేశ్వరరావు, ఎర్నేని సీతాదేవి వంటి వారికి సైతం తదుపరి ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.