CM Revanth Reddy Direction to Congress Leaders: ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా ప్రతినిధులతోపాటు అధికారులు, పార్టీ నాయకులు పలువురు సీఎంను కలిశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి, ఇతర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు ప్రజాప్రతినిధులతో సీఎం మాటామంతీ కలిపినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతోపాటు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఏమి చేస్తున్నారో తమ వద్ద పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్దామని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజు తాను కూడా ప్రజా ప్రతినిధులతో మాట్లాడతానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇవాళ నుంచే ఆ కార్యక్రమం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ఇవాళ ఉదయం పలువురు మంత్రులతో తాను మాట్లాడానని, అదేవిధంగా ప్రతి రోజు కొందరితో మాట్లాడతానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ప్రజాప్రతినిధులు దగ్గర కావాలని స్పష్టం చేశారు.
'ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం' - సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు