Chess Player Samuel Stephen From Anantapur Bagged Medals : పదమూడేళ్ల వయసులో చదరంగంలో దూసుకుపోతున్నాడు ఆ బాలుడు. ఏడేళ్ల వయసులో ఇంట్లో పాత సామాన్ల మధ్య దొరికిన ఓ చెస్ బోర్డు ఆ బాలుడిని చెస్ ఆటగాడిగా మార్చేసింది. నాడు పాత చెస్ బోర్డును పట్టుకొని తిరిగిన ఆ బాలుడు నేడు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. తలిదండ్రులు, శిక్షకుడు ఇచ్చిన ధైర్యం, అంతర్లీనంగా ఉన్న ప్రతిభ అతన్ని 100కు పైగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసింది. అనంతపురానికి చెందిన ఏడో తరగతి చదవుతున్న శామ్యూల్ స్టీఫెన్ నోబెల్ చెస్ ఆటలో దూసుకుపోతున్న వైనంపై ప్రత్యేక కథనం.
అనంతపురానికి చెందిన శ్యాంసుందరరాజు, రెబెకా దంపతుల 13 ఏళ్ల ముద్దుల కుమారుడు శామ్యూల్ స్టీఫెన్ నోబెల్. స్టీఫెన్‌కు ఏడేళ్ల వయసులో తండ్రి సుందరరాజు ఇంట్లో పాత సామాన్లు సర్దుతుండగా ఓ మూలకు బూజుపట్టిన చెస్ బోర్డు దొరికింది. దుమ్ముపట్టిన ఆ చెస్ బోర్డును తండ్రితో శుభ్రం చేయించుకున్న శామ్యూల్ రెండు రోజులపాటు దాన్ని చేతిలో పట్టుకుని తిరిగాడు. ఎలా ఆడాలో చూపించాలని తల్లి రెబేకాను అడగటంతో తనకు తెలిసినట్లుగా చూపించారు.
ఆటపై స్టీఫెన్ మక్కువ చూపడంతో తల్లిదండ్రులిద్దరూ తమకు తెలిసినంత మేరకు చెస్ నేర్పించారు. పాఠశాలస్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తున్న శామ్యూల్ ప్రతిభను ఆ తల్లిదండ్రులు గుర్తించారు. తమ కుమారుడికి ఎలాగైనా చెస్ నేర్పించాలని శిక్షకుడి కోసం ప్రయత్నించగా అనంతపురంలోని సూపర్ కింగ్ చెస్ అకాడమీ నిర్వహకుడు హుసేన్ ఖాన్ గురించి చెప్పారు. శిక్షణ కోసం చెస్ అకాడమీలో చేరిన శామ్యూల్ హుసేన్ ఖాన్ శిక్షణలో ఆటలో రాటుదేలాడు. అది శామ్యూల్ ను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తలపడటానికి అర్హత సాధించేలా చేసింది.
ముద్దులొలికే ప్రాయంలో మంత్రముగ్ధుల్ని చేస్తోన్న చిన్నారి - 'వండర్ కిడ్ రికార్డు'లో చోటు
పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓవైపు హుసేన్ ఖాన్ వద్ద శిక్షణ తీసుకుంటూనే పది రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొని అన్నిచోట్లా శామ్యూల్ విజయం సాధించాడు. అండర్ నైన్ వయసులో పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన శామ్యూల్‌కు కరోనా లాక్‌డౌన్ శిక్షణకు అడ్డంకిగా మారింది. చెస్ అకాడమీకి వెళ్లి నేర్చుకునే అవకాశం లేక మూడు నెలలపాటు ఇంటి వద్దనే ఆన్లైన్ చెస్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. తల్లిదండ్రులతో ఇంటివద్దనే రోజూ మూడు గంటలపాటు చెస్ ఆడుతూ, ఆన్లైన్లో మెళకువలు నేర్చుకుంటూ శామ్యూల్ మరింతగా ఆటలో మెరుగుపడ్డాడు. ఇదే స్ఫూర్తితో లాక్‌డౌన్ అనంతరం మళ్లీ తన కోచ్ హుస్సేన్ వద్దకు వెళ్లి శిక్షణ కొనసాగించాడు.
'ఇలా శిక్షణ తీసుకుంటూనే మండ్యా, హోసూర్, జమ్ముకాశ్మీర్, విశాఖపట్నం, పెద్దాపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో పాల్గొని అన్నిచోట్లా విజయం సాధించి 1600 ర్యాంకుకు చేరుకున్నాడు. పెద్దాపురంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో తొలి స్థానం సాధించడంతో అంతర్జాతీయ స్థాయిలో సెర్బియాలో నిర్వహిస్తున్న వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్ కు, మంగోలియాలో నిర్వహిస్తున్న ఏషియన్ స్కూల్స్ చెస్ ఛాంపియన్ పోటీల్లో ఆడటానికి అర్హత సాధించాడు. తమ కుమారుడి ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహించడంతో ఈస్థాయికి చేరాడు.'-శ్యాం సుందరరాజు, శామ్యూల్ స్టీఫెన్ తండ్రి
శామ్యూల్‌ని అసాధారణ బాలుడిగా గుర్తించడం వల్లే తాను మరింత సమయం కేటాయించి శిక్షణ ఇచ్చినట్లు కోచ్ హుసేన్ చెప్పారు. మార్చి 19న సెర్పియాకు, మే 14న మంగోలియాలో అండర్ 13 వయసు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న శామ్యూల్ స్టీఫెన్ భారతదేశం తరపున అద్భుత విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.