RENU DESAI COMMENTS ON AKIRA NANDAN : నటి రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని నేనూ కోరుకుంటున్నాను. తల్లిగా అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అని నాకూ ఆత్రుతగా ఉంది. అకీరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడు" అని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఓ కంపెనీకి చెందిన ఐదు రకాల కొత్త ఉత్పత్తులను రేణూదేశాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడ చూడలేదని ఆనందోత్సాహం వ్యక్తం చేశారు.
విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదని సంతోషం వెలిబుచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే తనకు కూడా సంతోషమేనని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉందని, సామాజిక సేవా కార్యక్రమాల కోసం తన కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానని వివరించారు. ప్రొడక్ట్‌ను నమ్మితేనే తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానన్నారు. దక్షిణ భారతదేశ ప్రజలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదన్నారు. ఫారెన్ ఆహారాలు కంటే ఆంధ్ర పెసరట్టు చాలా మేలని నటి రేణూ దేశాయ్ తెలిపారు.
మెగా ఫ్యాన్స్ వెయిటింగ్: ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. అకీరా అరంగేట్రం గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం అకీరా కోసం ఓ పాన్ ఇండియా లవ్ యాక్షన్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని, ఓ ప్రముఖ బ్యానర్లో దీన్ని తెరకెక్కిస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం అకీరా నందన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.