ILLEGAL SAND TRANSPORTING IN NTR DISTRICT: ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుంటే దీనికి కొందరు నాయకులు, దళారులు తూట్లు పొడుస్తున్నారు. వివిధ మార్గాల్లో అక్రమాలకు తెర లేపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు. దొరికిందే అదనుగా విజయవాడ, హైదరాబాద్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల ఇసుక రేవు వద్ద ఈటీవీ-భారత్ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడు పలు అక్రమాలు వెలుగుచూశాయి.
గత ప్రభుత్వంలో ఇసుక కొరత: వైఎస్సార్సీపీ హయాంలో ఇసుక దొరకడం గగనంగా ఉండేది. వేల రూపాయలు వెచ్చించినా ఇసుక దొరకని పరిస్థితి. ఫలితంగా ఎక్కడికక్కడే భవన నిర్మాణాలు స్తంభించిపోయాయి. పేదలకు, కూలీలకు కూలీ దొరకడం చాలా కష్టమయ్యేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని మార్చేందుకు సిద్ధమైంది. ఇసుక కొరతకు, ఇతర సమస్యలకు ఇసుకను అక్రమ మార్గంలో తరలించడమే కారణమని భావించిన కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాక్టర్ల ద్వారా సమీప గ్రామాల ప్రజలు నదుల నుంచి ఉచితంగా పొందవచ్చునని అధికారులు స్పష్టం చేశారు.
ఆ 15 మంది MLAలకు చంద్రబాబు వార్నింగ్! - ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో జోక్యం
2720 కి బదులు 10వేలు వసూలు: లారీలకు మాత్రం కూలీల ద్వారా ఇసుకను నింపే బాధ్యతను, వారి నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యతను కొందరు గుత్తేదారులకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఇసుక తవ్వకాలు, రవాణాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈటీవీ-భారత్ బృందం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెండ్యాల 1, 2 ఇసుక రేపుల వద్ద పరిస్థితిని పరిశీలించింది. ఈ పరిశీలనలో పలు అక్రమాలు బయటపడ్డాయి. ఇసుక స్టాక్ యార్డు నుంచి మాత్రమే లారీలకు ఇసుక తరలింపు, రవాణా జరగాలి. ఇందుకు ఒక టన్నుకు 136 రూపాయలు వాహనదారులు చెల్లించాలి. ఈ లెక్కన 20 టన్నుల ఇసుకకు 2720 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కో లారీకి 10 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
20 టన్నులకు బదులు 50 టన్నులు: గరిష్ఠంగా ఒక్కో లారీలో 20 టన్నుల వరకు ఇసుకను నింపడానికి అనుమతులు ఉన్నాయి. కానీ వాస్తవంగా జరుగుతోంది వేరు. ఒక్కో లారీలో 50 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఇక్కడ పట్టించుకునే, పర్యవేక్షణ చేసే అధికారులే కరవయ్యారు. ఇక ఇసుక రీచ్ లలో యంత్రాలతో ఇసుకను తీయడానికి అవకాశం లేదు. దీనిని సైతం గుత్తేదారులు ఉల్లంఘిస్తున్నారు. ఏకంగా ప్రొక్లైనర్లు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. అడుగు భాగంలో నీరు ఊరే దాకా ఇసుకను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు తప్ప లారీలు ఇసుక రీచ్ లోకి అడుగుపెట్టడానికి లేదు.
''వాస్తవానికి ట్రాక్టర్ల ద్వారా ఉచిత ఇసుకను తవ్వుకోవడానికి, తరలించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మాకు ఉపాధి కలుగుతుంది. మాకు రోజుకు 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల మాకు మాకు పని దొరుకుతుంది. మేము లారీలకు లోడింగ్ చేయడం లేదు. కేవలం ట్రాక్టర్లకే ఇసుకను లోడ్ చేస్తున్నాం'' -ఇసుక కూలీలు
అయినప్పటికీ లారీలు, టిప్పర్లు యథేఛ్చగా రేవుల్లోకి వచ్చి ఇసుకను తరలిస్తున్నాయి. ప్రభుత్వం కొంతమేరకు ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఈ స్థలంలో జెండాలు కూడా పాతి హద్దులు నిర్ణయించింది. వీటిని కూడా ఉల్లంఘిస్తున్నారు. ఈటీవీ-భారత్ ప్రతినిధులు రీచ్లోకి అడుగుపెట్టగానే ప్రొక్లైన్లు, లారీ వాహనదారులు ఎక్కడివారక్కడే వాహనాలు వదిలి పరారయ్యారు. ప్రభుత్వం ఎంతో ఆశయంతో ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడితే సరైన పర్యవేక్షణ లేక అది కాస్త నీరుకారుతుంది. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇసుక తవ్వకాలు, రవాణా వ్యవహారంలో హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. వీరి అనుచరులే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు- మంటల్లో జేసీబీ
ప్రభుత్వం అవకాశమిచ్చినా సహకరమేదీ? - అధికారుల వైఖరితో ఇసుక కష్టాలు