Union Minister Hardeep Singh Puri in Vijayawada: నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 90 వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు, ఆయా ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు బీపీసీఎల్ ప్రాజెక్టును తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం వద్ద ఆరు వేల ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని విజయవాడ పర్యటనకు వచ్చిన మంత్రి హరిదీప్‌సింగ్‌పూరి తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లోని అంశాలను వివరించేందుకు, అభిప్రాయాలు సేకరించేందుకు మేథావులతో ప్రత్యేకంగా భేటీ అయిన హరిదీప్‌సింగ్‌పూరి మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో 2,650 కోట్ల రూపాయలతో గెయిల్ ద్వారా ప్రారంభించిన గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ప్రధాన పైపు లైను పనులు కొలిక్కి వచ్చాయని అన్నారు.
ఇతర పనులు కూడా సత్వరం పూర్తి చేసి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పైపు లైను ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డబుల్ ఇంజను సర్కార్ ద్వారా రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సముచిత సహకారం అందిస్తోందని వివరించారు. టాక్స్ డెవల్యూషన్ పేరిట 123 శాతం సాయం పెంచిందని చెప్పారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం కింద ప్రత్యేక సహాయంగా రాష్ట్రానికి ఈ ఏడాది జనవరి 12 నాటికి ఈ ఆర్ధిక సంవత్సరంలో 5,663 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు.
గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయాలు: రైల్వే బడ్జెట్‌లో 9,417 కోట్ల రూపాయలు సాయం ప్రకటించిందన్నారు. 90 వేల కోట్ల రూపాయలతో కాకినాడలో హెచ్‌పీసీఎల్ రాబోతోందని చెప్పారు. ఓఎన్‌జీసీ ద్వారా ఒక్క రోజులో 45 వేల బ్యారెల్స్ ముడి చమురును ఉత్పత్తి చేసేలా ఆదునికీకరిస్తోందన్నారు. విశాఖ పూడిమడక ప్రాంతం గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా అభివృద్ధి చెందబోతోందని చెప్పారు. ప్రపంచంలోనే ఇంధన ఖర్చు తగ్గించిన దేశం ఒక్క భారతదేశమేనని తెలిపారు. రాష్ట్రంలోని దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు వద్ద గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రధానమంత్రి మోదీ కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో 4,741 కిలోమీటర్లకు పైగా పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్లోబల్ మార్కెట్లో తన మార్క్ చూపించాలనుకుంటున్నారని అన్నారు. దిల్లీలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, త్వరలో బిహార్ ఎన్నికల్లో కమలం విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్ పూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు. మేథావుల సదస్సులో ఏపీ ఛాంబరు ఆఫ్ కామర్స్, రాష్ట్ర పెట్రోలియం డీలర్ల సమాఖ్య, లారీ ఓనర్స్ అసోయేషన్ ఇతర సంఘాల ప్రతినిధులు కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఒక దేశం, ఒకే ధర విధానం అమలు చేయాలని కోరారు. డీలర్ మార్జిన్ సవరించాలని కోరారు.
ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు - రామాయపట్నంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ