TTD BOARD MEMBER ISSUE SOLVED: టీటీడీ ఉద్యోగులు, బోర్డు సభ్యుడి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్యామలరావు చొరవతో సమావేశమైన ఉద్యోగులు, బోర్డు సభ్యులు పరస్పరం చర్చించుకున్నారు. మహాద్వారం గేటు వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్‌ను దూషించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పారు. ఘటన దురదృష్టకరమని, ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించుకున్నామని బోర్డు సభ్యులు తెలిపారు.
కాగా మూడు రోజుల క్రితం టీటీడీ ఉద్యోగిని బోర్డు సభ్యుడు దూషించారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆందోళన చేస్తున్నామంటూ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో శ్యామలరావు ఉద్యోగులు, బోర్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఈవో హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. బోర్డు సభ్యుడు ఉద్యోగికి క్షమాపణ చెప్పడంతో ఆందోళనలను విరమిస్తున్నామన్నారు.
"ఉద్యోగిని బోర్డు సభ్యుడు దూషించడం దురదృష్టకరం. ఉద్యోగికి క్షమాపణ చెప్పాలని 2 రోజులు ఆందోళన చేశాం. మా సమస్యలను టీటీడీ ఈవో, అదనపు ఈవో పరిశీలించారు. బాలాజీసింగ్‌కు బోర్డు సభ్యుడు నరేష్ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు మా ఆందోళన విరమిస్తున్నాం". - నాగార్జున, టీటీడీ ఉద్యోగ సంఘం నాయకుడు
అసలు ఎందుకీ వివాదం: టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ 18వ తేదీన ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు వచ్చారు. బోర్డు సభ్యుడి సహాయకుడు గేటు తీయాలని ఉద్యోగి బాలాజీ సింగ్‌ని కోరారు. అయితే మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపించడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆయన సమాధానమిచ్చారు. దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ టీటీడీ ఉద్యోగిపై అసభ్యంగా దూషించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు ద్వారానే బయటకు పంపించారు. దీనిపై ఉద్యోగి పట్ల దురుసుగా వ్యవహరించిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తాజాగా ఆ వివాదానికి తెరపడింది.
'నిన్ను ఇక్కడ పెట్టిందెవరు?' - టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం