Why Store Pickles in Jars : మనలో చాలా మంది ఇళ్లలో దాదాపు ఏడాదికి సరిపడా ఆవకాయ, ఉసిరి వంటి రకరకాల పచ్చళ్లు నిల్వ ఉంటాయి. కాలానికి అనుగుణంగా పచ్చళ్లు తయారు చేసి నిల్వ పెడుతుంటారు. ప్రతిరోజు ఇంట్లో ఏ కూర వండినా సరే, ఓ ఆవకాయ ముక్క వేసుకుని తినకపోతే మనసు తృప్తిగా ఉండదని ఎక్కువమంది చెబుతుంటారు. అయితే, పచ్చళ్లు నిల్వ చేయడానికి మెజార్టీ జనాలు గాజు జాడీలు, గాజు పాత్రలనే ఉపయోగించడం మీరు గమనించే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా?! పచ్చళ్లను గాజు జాడీల్లోనే ఎందుకు స్టోర్ చేస్తారని? ఇలా పచ్చళ్లు నిల్వ చేయడానికి కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం.
రంగు, రుచి పూర్తిగా మారిపోతుంది :
ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఎక్కువ మొత్తంలో పచ్చళ్లను తయారు చేస్తారు. వాటిని నిల్వ ఉంచేందుకు అల్యూమినియం, స్టీలు పాత్రలను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. కారణం ఏంటంటే, సాధారణంగా ఆవకాయ, ఉసిరి, నిమ్మ వంటి వివిధ రకాల పచ్చళ్లలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు వేస్తేనే పచ్చడి త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేకపోతే పచ్చడిపై ఫంగస్ చేసి చట్నీ రంగు, రుచి పూర్తిగా మారిపోతుంది. అయితే, ఉప్పు అల్యూమినియంతో కలిస్తే మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని విష పదార్థాలు లోపల తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా పచ్చళ్లను జాడీల్లో స్టోర్ చేస్తుంటారు.

స్టీల్ పాత్రల్లోనూ :
అలాగే స్టీల్ పాత్రల్లో పచ్చళ్లను నిల్వ చేసినా కూడా అందులో రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయన చర్య వల్ల పచ్చడి రంగు మారడంతో పాటు తినడానికి పనికి రాదు. అలాగే పచ్చడి ఉంచిని పాత్ర కూడా పాడవుతుంది.
మృదువైన "స్పాంజ్ దోశలు" - పప్పు రుబ్బకుండా, చుక్క నూనె వాడకుండా చేసేయండి!
ప్లాస్టిక్ బాక్స్‌లలో వద్దు!:
ప్రస్తుత కాలంలో మనం వంటింట్లో చాలా రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నాం. అయితే, కొంతమంది పచ్చళ్లను కూడా ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ ఉంచుతారు. ప్లాస్టిక్ కంటైనర్లో పచ్చళ్లను ఎక్కువ కాలం ఉంచితే, అందులో రసాయనాలు విడుదలై నూనె, కారంతో కలిసి తినడానికి పనికి రాకుండా వాసన వస్తాయి. దీనివల్ల ఎంతో కష్టపడి పెట్టుకున్న పచ్చడి నోటికి అందకుండా పోతుంది. కాబట్టి, పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి గాజు, జాడీలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
భయం ఉండదు!:
పూర్వకాలంలో మన పెద్దలు పచ్చళ్లను నిల్వ ఉంచేందుకు గాజు జాడీలు, గాజు పాత్రలనే ఉపయోగించేవారు. వీటి వల్ల చట్నీలో రసాయనాలు విడుదలవుతాయనే భయం ఉండదు.
అల్యూమినియం, స్టీల్ పాత్రల్లో నిల్వ చేసిన పచ్చడి తినడం వల్ల ఏమవుతుంది ?
- అల్యూమినియం, స్టీల్ పాత్రల్లో నిల్వ చేసిన పచ్చడి తినడం వల్ల అజీర్తి, పొట్ట ఉబ్బరంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
- తడిలేకుండా, గాలి ఆడకుండా గాజు జాడీల్లో ఎక్కువ కాలం పచ్చళ్లు నిల్వ ఉంచినా వాటి రంగు, రుచి, వాసనలో ఎలాంటి తేడా ఉండదు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పచ్చళ్లను స్టోర్ చేసే పాత్రల విషయంలోనే కాదు, దానిని వినియోగించే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద జాడీల్లో నుంచి పచ్చడి చిన్న గాజు సీసాలోకి తీసుకునేటప్పుడు చేతులు తడి లేకుండా చూసుకోవాలి. పచ్చడికి తడి తగలడం వల్ల పాడైపోతుంది. అలాగే పచ్చడి తీసేందుకు తడి గరిటెలు, చెంచాలు కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ స్టీల్ గరిటెలకు బదులుగా చెక్కవి వినియోగిస్తే చాలా మంచిదని నిపుణులంటున్నారు. ఈ విధంగా నిల్వ పచ్చళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఎక్కువ రోజులు కమ్మటి పచ్చడి రుచిని ఆస్వాదించవచ్చు.
రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!