Ministers Nadendla and Anam Inaugurated Grain Procurement Center : రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు మించి రావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు ఉంటాయన్నారు. బస్తాకు ఐదు కేజీలకు మించి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. అలాగే సంగం మండల కేంద్రంలో రూ. 20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులు చేసి 5.87 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 7,480 కోట్ల రూపాయలు జమచేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో 32కోట్ల రూపాయల రైతుల సొమ్ముని మోసం చేసి దోచేశారన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి జైలుశిక్ష తప్పదు : మంత్రి మనోహర్
గత ప్రభుత్వ పాలకులు వ్యవస్థలను దుర్వినియోగం చేసి రైతులను మోసం చేశారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. గత ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.361 కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిల్లర్లకు రూ. 10 కోట్లు చెల్లించామన్నారు. అలాగే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించకుండా రూ.1,674 కోట్లు బకాయి పెట్టిందని, తమ ప్రభుత్వం ఆ బకాయిలను రైతులకు చెల్లించిందన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రవాణా, హమాలి చార్జీలు రూ. 1.40 కోట్లు రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసి 24 గంటల్లోపే డబ్బులు చెల్లించామని చెప్పారు.
'వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్ళారా చూడండి - మీ నిర్వాకం తెలుస్తుంది'
గత ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణణాతీతం అని మంత్రి ఆనం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు వైఎస్సార్సీపీ పేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవాలంటే రైస్ మిల్లుల వద్ద నాలుగైదు రోజులపాటు తిండితిప్పలు లేకుండా రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్, రాష్ట్ర వక్ప్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
భయం లేకుండా బియ్యం దందా - వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమాలు!