JOINT COLLECTOR NOTICE TO YSRCP MLA AKEPATI : ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తరపున న్యాయవాది హాజరు కాగా ఎన్నిసార్లు ఇదే విధంగా తప్పించుకుంటారని వ్యాఖ్యానించారు. రాజంపేట కోర్టుకు వెళ్తామని న్యాయవాది చెప్పడంతో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న జేసీ ఆదర్శ రాజేంద్రన్ మరింత అసహనానికి లోనయ్యారు. జేసీ కోర్టుకు రమ్మని నోటీసిస్తే రాజంపేట కోర్టుకు వెళ్తామని సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఎవరు నోటీసులు ఇచ్చినా ఎలాంటి విచారణకు వెళ్లేది లేదని ఎమ్మెల్యే ఆకేపాటి స్పష్టం చేయడం వివాదాస్పదంగా మారింది.
అన్నమయ్య జిల్లా రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ నోటీసులు ఇచ్చినా ఎమ్మెల్యే హాజరు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో వందల ఎకరాలు ఆక్రమించారని రాజంపేటకు చెందిన సుబ్బ నర్సయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన అధికారులు జాయింట్ కలెక్టర్ కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే నాలుగైదు సార్లు నోటీసులు ఇచ్చినా ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. దళితుల పేరుతో ప్రభుత్వ భూములు కాజేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనేది ప్రధాన అభియోగం.
శనివారం ఉదయం పదిన్నర గంటలకు రాయచోటిలోని జేసీ కోర్టుకు హాజరు కావాలని ఎమ్మెల్యే, భార్య జ్యోతి, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సుజనలకు నోటీసులు పంపినా హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాది సుదర్శన్ రెడ్డి వచ్చారు. కొన్ని ముఖ్యమైన పనులు ఉన్న కారణంగా ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు హాజరు కాలేక పోయారని న్యాయవాది జేసీ కోర్టుకు తెలిపారు. ఎన్నిసార్లు ఇదే విధమైన కారణం చెబుతారని జేసీ అసహనం వ్యక్తం చేశారు. ఈ భూముల అంశంపై రాజంపేట కోర్టుకు వెళ్తామని న్యాయవాది చెప్పగా ఇక్కడికి రమ్మంటే కోర్టుకు వెళ్తామని ఎలా చెబుతారని జేసీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు దారుడు సుబ్బనర్సయ్య ఏడోసారి జేసీ కోర్టుకు హాజరయ్యారు. తానుమాత్రం ప్రతి వాయిదాకు హాజరవుతున్నా భూములు కొట్టేసిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు రావడం లేదన్నారు.
భూమి ఆక్రమిస్తే స్వాధీనం చేసుకోండి - విచారణకు వెళ్లే ప్రసక్తే లేదు: అమర్నాథ్ రెడ్డి
ఆక్రమిత భూముల అంశంపై రాయచోటి జేసీ కోర్టుకు శనివారం ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాల్సిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి అదే సమయంలో కడప ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభకు మాత్రం హాజరయ్యారు. భూముల ఆక్రమణపై తాను భయపడేది లేదని, విచారణకు కూడా వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
ఆక్రమిత భూములపై ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జేసీ కోర్టుకు గైర్హాజరు అవుతుండటంతో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జిల్లా కలెక్టర్ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ కూసినా ఆగని అధికార పార్టీ రాజకీయ సమావేశాలు - ZPTC Meeting in Kadapa