Instant Gunta Ponganalu in Telugu : పిల్లలు, పెద్దలందరూ ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల్లో గుంత పొంగనాలు ఒకటి. అయితే, ఇంట్లో వీటిని చేయాలంటే ముందు రోజు పప్పు నానబెట్టి, రాత్రి రుబ్బి పులియబెట్టాల్సి ఉంటుంది. ఒక్కొసారి ఇలా చేయడం కుదరదు. అలాంటప్పుడు బొంబాయి రవ్వతో ఇన్స్టంట్ గుంత పొంగనాలు ట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే కేవలం నిమిషాల్లోనే వేడివేడి కమ్మటి పొంగనాలు మీ ముందుంటాయి. పైగా వీటిని చేసుకోవడం కూడా ఈజీ! మరి ఇక ఆలస్యం చేయకుండా వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - కప్పు
- పెరుగు - పావుకప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉల్లిపాయ తరుగు - పావుకప్పు
- క్యారెట్ తురుము - పావుకప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- వంటసోడా - చిటికెడు
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- టమాటా - 1 (సన్నటి ముక్కలు)
- క్యాప్సికం తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
తాలింపు కోసం :
- జీలకర్ర - అరచెంచా
- ఆవాలు - అరచెంచా
- నూనె - టేబుల్‌స్పూన్
- కరివేపాకు తరుగు - కొద్దిగా
- పసుపు - పావుటీస్పూన్
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలపండి.
- అలాగే రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా, పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి.
- పొంగనాల పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అలా వదిలేయాలి.
- ఇప్పుడు పొంగనాల పిండిలో తాలింపు వేయడం కోసం స్టవ్‌పై చిన్న గిన్నె పెట్టండి. ఇందులో ఆయిల్ వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు తరుగు వేసి వేపండి.
- తాలింపు దోరగా వేగిన తర్వాత ముందుగా కలిపిపెట్టుకున్న పొంగనాల పిండిలో కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. అనంతరం రవ్వ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి కాల్చుకోవాలి.
- ఒకవైపు కాలిన అనంతరం తిరగేసి మరోవైపు కాలనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఇలా పిండి మొత్తాన్ని పొంగనాలుగా వేసుకోవాలి.
- వేడివేడిగా పొంగనాలను ఏదైనా చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేయొచ్చు.
- ఈ ఇన్స్టంట్ పొంగనాల రెసిపీ నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో తప్పక ట్రై చేయండి!
రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!
మృదువైన "స్పాంజ్ దోశలు" - పప్పు రుబ్బకుండా, చుక్క నూనె వాడకుండా చేసేయండి!