Government Allocating Unique identification Numbers To Farmers : ఆధార్ కార్డు మాదిరిగానే సొంత భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం భూధార్ సంఖ్యను కేటాయిస్తోంది. భూమి హక్కులను ధ్రువీకరించే ఆధీకృత రికార్డులు కలిగిన రైతులకు మాత్రమే విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలతోపాటు బ్యాంక్ రుణాలు వంటి సౌకర్యాలకూ భూధార్ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాల్లో నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అదే సమయంలో కౌలు రైతులు, అసైన్డ్ రైతుల పరిస్థితి ఏంటని రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రైతులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సొంత భూమి కలిగిన రైతులను నమోదు చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ ఈ నెల 10న అన్ని జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు ప్రక్రియను ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్‌లో చేపడుతున్నారు.
రైతులకు అండ్రాయిడ్ మిత్రుడు - ఈ యాప్‌తో మీ సమస్యలకు చెక్
రైతు సేవాకేంద్రం సహాయకుడి వద్దకు రైతులు తమ ఆధార్ కార్డును, పట్టాదారు పాసు పుస్తకాన్ని లేదా 1B అడంగల్‌ను, ఆధార్ లింక్ అయిన మొబైల్ ఫోన్ తీసుకెళ్లాలి. మీభూమి పోర్టల్, రికార్డ్స్ ఆఫ్ రైట్స్, పట్టాదార్ పాస్ పుస్తకాల ఆధారంగా రైతుల యాజమాన్య హక్కుల్ని నిర్ధారించి 11 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ ప్రక్రియను వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ప్రభుత్వం కేటాయించే భూధార్ ఆధారంగానే ప్రభుత్వ పథకాలైన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన, బీమా, బ్యాంకు రుణాలు మంజూరు చేయనున్నారు. దీంతో రైతులంతా జోరుగా నమోదు చేసుకుంటున్నారు. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలో 40వేల మంది రైతుల వరకు నమోదు చేసుకున్నారు. దూరప్రాంతాల్లో ఉన్నవారూ పేర్లు నమోదు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
రైతులకు గుడ్‌న్యూస్ - టమాటా కొనుగోళ్లు చేపట్టిన ప్రభుత్వం
కౌలుదారులతోపాటు దేవదాయ భూములు, అసైన్డ్, అటవీ భూములు సాగు చేసుకునే చాలామంది రైతులకు నేరుగా యాజమాన్య హక్కులు లేవని, వీరి సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇచ్చే ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
మిర్చి రైతులను ఆదుకోవాలని కోరాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు