AMARAVATI OUTER RING ROAD: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులను కూటమి సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి వడ్డాణంలా భాసిల్లే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది.
23 మండలాలు, 121 గ్రామాల మీదుగా: రాష్ట్రంలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఓఆర్‌ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్‌ఆర్ వెళుతోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు.
తూర్పు బైపాస్ బదులు రెండు లింక్ రోడ్ల నిర్మాణం: 189.9 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌కు ఇటీవల ఆమోదం తెలిపిన ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్‌కి అనుసంధానం ఉన్నట్లే, చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేశారు.
దారులన్నీ అమరావతికే! - ఏడు జాతీయ రహదారులతో అనుసంధానం
అభ్యంతరాలు ఉంటే జేసీలతో సమావేశాలు: NHAI నుంచి వెళ్లిన ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులతో కూడిన ప్రతిపాదన, రెండు లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక, వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్‌ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీచేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని జేసీ, NHAI స్థాయిలో పరిష్కరిస్తారు. అదే టైమ్‌లో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్‌మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు.
భూసేకరణ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ: జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక 3డీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం అధీనంలోకి వెళ్లినట్లవుతుంది. ఆ తర్వాత 3జి3 నోటిఫికేషన్ ఇస్తారు. పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీచేస్తారు. ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉంది, ఎన్ని నిర్మాణాలున్నాయి, వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది. తరువాత భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్‌హెచ్‌ఏఐకి పంపిస్తారు. ఆ సొమ్మును ఎన్‌హెచ్‌ఏఐ అందజేస్తే భూమికి సంబంధించిన యజమానులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తారు. తర్వాత భూములను సంబంధిత జేసీలు తమ ఆధీనంలోకి తీసుకొని, ఎన్‌హెచ్‌ఏఐ పేరిట మ్యుటేషన్ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ, మరోవైపు వివిధ అనుమతులను ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు తీసుకోనున్నారు.
189 కిలోమీటర్లు, ఆరు వరుసలతో అమరావతి ORR - కేంద్ర కమిటీ ఆమోదం