AP FiberNet Issue: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అధికారుల నుంచి వివరణ కోరారు. ఆ సంస్థ ఎండీ దినేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌లతో ఆయన సచివాలయంలో సమావేశమై ఈ అంశాలపై ఆరా తీశారు. ఫైబర్‌నెట్ సంస్థలో జరుగుతున్న అవకతవకలు, ఉద్యోగుల పనితీరుపై ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై శనివారం సాయంత్రంలోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎండీ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. మరోవైపు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఏపీఎఫ్ఎస్ఎల్ ఛైర్మన్ జీవీరెడ్డికి కూడా మంత్రి కార్యాలయం లేఖ రాసింది. అయితే రెండు రోజుల్లోగా మొత్తం ఆధారాలు సమర్పిస్తానని జీవీ రెడ్డి మంత్రికి తెలియజేశారు.
జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: ఏపీ ఫైబర్‌నెట్ సంస్థను పూర్తిగా కనుమరుగు చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎండీ దినేష్ కుమార్ ఏపీ ఫైబర్‌నెట్ సంస్థను చంపేయాలనుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫైబర్‌నెట్‌లో ఉన్నత ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వానికి సహకరించే విధంగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టకపోగా, సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని జీవీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ నష్టపోయిన ఆదాయాన్ని అధికారుల నుంచే రాబట్టేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. ముఖ్యంగా ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో చేరిన ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎండీ దినేష్ వ్యవహార శైలిపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. జీఎస్టీ అధికారులు రూ.377 కోట్లు జరిమానా విధించినా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కొందరు సిబ్బందికి అక్రమంగా జీతాలు చెల్లించారని, దాన్ని అధికారుల నుంచి రికవరీ చేయాలని అన్నారు. విచారణ జరిపి సొమ్ము రికవరీ చేయాలని సీఎస్‌కు లేఖ రాయనున్నట్టు జీవీరెడ్డి ఆరోపించారు. అధికారుల తీరుపై సీఐడీ లేదా విజిలెన్స్ విచారణ జరపాలని సీఎస్‌ను కోరతానన్నారు. ఎండీ దినేష్ నుంచి వివరణ వచ్చాక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. సీఎస్ విజయానంద్ కూడా ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను ఆరా తీసిరారు. అలాగే దినేష్ నుంచి వివరణ కోరారు.
ఫైబర్‌నెట్‌ను చంపేయాలనుకుంటున్నారా? - ముగ్గురు అధికారులు తొలగింపు : ఛైర్మన్ జీవీరెడ్డి
ఫైబర్‌నెట్‌కు మళ్లీ ఊపిరి - రూ.149 బేసిక్ ప్లాన్‌పై ప్రభుత్వం ఫోకస్