Sankranti 2025 Special: ఉదయం లేవడం స్కూల్కు వెళ్లేందుకు రెడీ కావడం, అమ్మ పెట్టిన టిఫిన్ తిని బ్యాగ్ వీపున వేసుకుని పరుగు పరుగున పాఠశాలకు వెళ్లడం, మళ్లీ సాయంత్రం ఇంటికి అలసిపోయి రావడం. ఇది విద్యార్థుల నిత్య జీవితం. అలాంటి వారికి మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశమే లేకుండాపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు చెప్పాలన్నా వారిని చూసి నేర్చుకోవాలన్నా పిల్లలకు కుదరడం లేదు.
ఎందుకంటే వారంతా ఎక్కువ సమయం గడిపేది పాఠశాలల్లోనే. అందుకే మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను చదువుతో పాటు అక్కడే నేర్పే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పాఠశాలలు. పండగల పూట ఆ రోజు విశేషాలను చెప్పడంతో పాటు, ఆ రోజుల్లో ఏమేం చేస్తారో చేసి చూపిస్తున్నారు. అంతేకాదు పిల్లలందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. దీంతో పిల్లలకు ఆ పండగ అంటే తెలుస్తోంది. భవిష్యత్లో ఈ పిల్లలు ఆ తరువాత వచ్చే తరానికి ఇవి తెలియజేస్తారు.
సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో హడావుడి ఉంటుంది. జనవరి నెల మొదలు కావడమే ఆలస్యం అన్ని గ్రామాల్లో ఈ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయడం, హరిదాసులు ఇంటింటికి తిరగడం వంటివి చూస్తుంటాం. ఇక పిల్లలకు సెలవులిస్తే అందరూ ఒక్కచోట చేరి ఆడిపాడి సందడి చేస్తుంటారు. ఇక పాఠశాలల్లోనూ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం మంచి రంగులతో ముగ్గులు వేసినవారికి బహుమతులు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని శ్రీ బాలాజీ కాన్వెంట్ యాజమాన్యం తమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించింది.. పాఠశాల ప్రాంగణంలో రంగురంగులు ముగ్గులు వేయించారు. విద్యార్థినిలచే బొమ్మల కొలువును ఏర్పాటు చేయించారు. పండుగరోజుల్లో ఇంటి వద్ద తయారు చేసే వివిధ రకాల పిండి వంటలను ప్రదర్శనగా పెట్టించారు. చిన్నారులకు భోగి పళ్ళు వేసి గొబ్బెమ్మల పాటలు పాడించారు. డాన్సులు చేయించారు. హరిదాసు సంకీర్తనలు, కోడిపందేలు, భోగి మంటలు ఇలా సంక్రాంతి పండుగలోని అన్ని విశిష్టతలను వివరిస్తూ వారిచేతే కార్యక్రమాలను నిర్వహించారు.
ఎప్పుడూ కాలేజీల్లో యూనిఫాంతో కనిపించే యువతులు సాంప్రదాయ వస్త్రాల్లో కనిపిస్తే కనువిందుగా ఉంటుంది. ఇంట్లో జీన్స్, నైట్ డ్రెస్సుల్లో దర్శనం ఇచ్చే వాళ్లు లంగా ఓణీలు, చీరల్లో కనిపిస్తే ఎవరైనా సూపర్ అనాల్సిందే. మన సాంప్రదాయ వస్త్రాల్లో ఉండే గొప్పతనం అదీ. విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ, ముగ్గులు వేస్తూ అలరించారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లి పోటీల్లో మహిళలు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మరోవైపు ఆర్టీసీ, రైల్వేశాఖ సంక్రాంతి పండగ కోసం ప్రత్యేక సర్వీసులు నడపనున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఎక్కడున్నా సంక్రాంతికి ఇంటికొస్తారు. దీంతో ప్రభుత్వం వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది.
దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్