Cases on Political Leaders : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి కేసులు తమపై నమోదు చేశారో తెలియని పరిస్థితి ప్రతిపక్ష నేతలది. ఈ నేపథ్యంలో వారంతా తమపై నమోదైన కేసుల వివరాలు కోరుతూ పోలీసులకు లేఖ రాశారు. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించగా పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలను ఈ నెల 16 లోగా ఇవ్వాలని పోలీసులను హైకోర్టు మౌఖికంగా ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందజేసేలా ఆయా జిల్లాల ఎస్పీలు, రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలను ఈ నెల 16 లోగా ఇవ్వాలని పోలీసులను హైకోర్టు మౌఖికంగా ఆదేశించింది. విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. వివిధ ఠాణాలలో తమపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, సీనియర్ నేత, నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బి. రామచంద్రయాదవ్ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.